పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వార్థబుద్ధి తెలుసు. మనం ఇతరులను ప్రేమించమని తెలుసు. కనుక తాను శిష్యులను ప్రేమించి, వాళ్ళ కాళ్ళు కడిగి, మనం కూడ తనలాగే ఇతరులను ప్రేమించాలని ఆజ్ఞాపించాడు. మన సోదరప్రేమకు అతడే ఆదర్శం. కనుక ఈ గుణం కొంతవరకైనా అలవడితేగాని క్రీస్తు శిష్యులం కాలేం. మనం తోడివారిని ప్రేమించి వారికి సేవలు చేస్తున్నట్లు నటిస్తేనే చాలదు. అది వట్టి రాజకీయం. ఆ పనిని నిజంగానే చేయాలి. విశేషంగా మనతో కలసి జీవించేవారిని, మన చుటూ ఉన్నవారిని పట్టించుకొని ఆదరాభిమానాలతో చూడాలి.

3. పేదరికం

క్రీస్తుకి పేదరికం ఇష్టం. అతడు బుద్ధిపూర్వకంగానే పేద జీవితం గడిపినవాడు. అతని బోధల ప్రకారం, మనం ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకోగూడదు - మత్త 6,19. ఒకేసారి ధనం దేవుడు అనే యిద్దరు యజమానులకు సేవలు చేయలేం - 6,24. పేదలు ధన్యులు, ధనికులకు అనర్ధం - లూకా 6,24. ధనిక యువకుడు తన అస్తులను విక్రయించి క్రీస్తుని అనుసరించాలి - మార్కు 10,21. ధనవంతుడు దైవరాజ్యంలో ప్రవేశించడంకంటె ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం - 10,25. తన ధాన్యాన్ని దాచుకోవడానికి పెద్దకొట్ల కట్టించగోరిన ధనికుడు అవివేకి - లూకా 12,20. ధనికుడు లాజరు కథలో పేదవాడు స్వర్గంలో అబ్రాహాము వొడిలో కూర్చుండగా, ధనికుడు నరకాగ్నిలో కూరుకొనిపోయాడు - లూకా 16,22.

క్రీస్తు చేసిన ఈ వుపదేశాలను నేడు ధనికులు లెక్కచేయకపోవచ్చు. కాని అతని బోధల్లో కలిమి పేదరికంఅనే అంశమే అన్నిటికంటె ఎక్కువసార్లు వస్తుంది. చట్టాలు పాటించడం, తిరుసభ అధికారం, లైంగిక వాంఛలు, నరకం మొదలైన అంశాలు ప్రభువు బోధల్లో అంత అధికంగా రావు కలిమిలేములు మాత్రం తొలిమూడు సువిశేషాల్లో ప్రతి పది వాక్యాలకు ఒకసారి తగలుతుంటాయి. పూర్వవేదం కూడ ఈ యంశాన్నిమాటిమాటికీ ప్రస్తావిస్తుంది. అక్కడ ఎక్కువసార్లు కన్పించే అంశం విగ్రహారాధనం. ఇది యాదుల ప్రధాన పాపం. దాని తర్వాత ప్రధానంగా కన్పించే అంశం కలిమిలేములు.

బైబుల్లో ఈ యంశాన్ని ఇంతగా నొక్కిచెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, మన సంపదలున్న చోటనే మన హృదయంకూడ ఉంటుంది - మత్త 6,21. ధనాన్ని కోరేవాడి మనసు ఎప్పుడు దానిమీదనే ఉంటుంది. దేవుణ్ణి కోరేవాడి మనసు ఎప్పుడూ దేవునిమీదనే ఉంటుంది. కనుక మన సంపద దేవుడు కావాలిగాని ధనం కాగూడదు. ఐనా లోకంలోని నరులు సులభంగా దేవుణ్ణి విడనాడి ధనం వైపు వెళ్ళుతుంటారు. డబ్బు మనకు పెద్ద ప్రలోభం. అందుకే బైబులు మాటిమాటికి ఈ యంశాన్ని ప్రస్తావిసూ ఉంటుంది.