పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేలుకోరి, మన పాపాలు మన్నించి, మనలను ప్రేమించే తండ్రిని మన తరపున మనం పూర్ణహృదయంతో ప్రేమించాలి. ప్రభువు బోధల్లో ముఖ్యాంశం దేవుణ్ణి తండ్రిగా భావించి ప్రేమించడమే.

2. తోడి నరులపట్ల ప్రేమ

క్రీస్తు దృష్టిలో దేవుణ్ణి ప్రేమించడం ఎంతముఖ్యమో తోడి నరులను ప్రేమించడంగూడ అంత ముఖ్యం. ఈ రెండవ ఆజ్ఞ మొదటి ఆజ్ఞ అంత బలీయమైంది - మత్త22, 39. అతడు సోదర ప్రేమను మనకు ఉపదేశించక ముందు దాన్ని స్వయంగా ఆచరించాడు.

మన విరోధులనూ, మనకు కీడుచేసిన వాళ్ళనూ, మనలను హింసించేవాళ్ళను గూడ ప్రేమించాలి. వారికొరకు ప్రార్థన చేయాలి - మత్త5,44. దేవుడు మన తప్పిదాలను మన్నిస్తున్నాడు. ఆలాగే మనంకూడ ఇతరుల అపరాధాలను మన్నించాలి - 6,12. ఇతరులు మనకు ఎన్నిసార్లు అపరాధం చేసినా మన్నించవలసిందే - 18,22. ఈ మన్నింపు వట్టి నటన కాక హృదయపూర్వకమైనది కావాలి - 18,35.

పేదసాదలపట్ల మనకు విశేష దయ ఉండాలి. మనకు ఉన్నదికూడ అమ్మి వారికి సాయం చేయాలి - మార్కు 10,21. అక్కరలో ఉన్నవారిని, వాళ్ళు మనకు అపరిచితులైనా సరే, తప్పక ఆదుకోవాలి. మంచి సమరయుని కథే దీనికి తార్కాణం - లూకా 10. ఇంకా మనం ఆకలిగొన్నవారికి భోజనం పెట్టాలి. బట్టలు లేనివారికి బట్టలీయాలి. వ్యాధిగ్రస్తులనూ చెరలో ఉన్నవారినీ పరామర్శించాలి. కడతీర్పు సామెత ఈ యంశాలన్నిటినీ విపులంగా పేర్కొంటుంది - మత్త 25. మనం ఇతరులకు ప్రేమతో వినయంతో సేవలు చేయాలి. ఈ సేవలు ఇతరుల పాదాలు కడిగేవరకు పోవాలి. క్రీస్తే దీనికి ఆదర్శం - యోహా 13,14-15. ఈ యంశాలనుగూర్చి ఆత్మ పరిశీలనం చేసి చూచుకొంటే ప్రభువు ఆదేశించిన సోదర ప్రేమను మనం ఏమాత్రం పాటించడంలేదని తెల్లమౌతుంది.

మనం సోదర ప్రేమను పాటిస్తున్నామాలేదా అని తెలసుకోవడానికి ప్రభువు రెండు సూత్రాలను ఇచ్చాడు. మొదటిది, మనలను మనం ప్రేమించుకొన్నట్లే తోడివారిని గూడ ప్రేమించాలి - మత్తయి 22, 38. మామూలుగా మనంతోడివారిని అసలు ప్రేమించం. పైగా వారిపట్ల ద్వేషం, కోపతాపాలు అసూయ పెంచుకొంటాం. ఇక వారిని మనలను మనం ప్రేమించు కొన్నంతగా ప్రేమించేదెక్కడ? రెండవది క్రీస్తు మనలను ప్రేమించినంతగా మనం ఇతరులను ప్రేమించాలి - యోహా 13,34. ప్రభువుకి మన