పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“పనులు" అనే మాటలద్వారా సూచింపబడ్డాయి. ఆ ప్రభువు తాను ఆచరించకుండా వట్టినే నీతులు బోధించినవాడు కాదు. అతని బోధల్లో ప్రధానమైంది ప్రేమసూత్రం. ఈ సూత్రాన్ని అతడు క్రియపూర్వకంగా పాటించి చూపించాడు. “తాను ప్రేమించినవారికోసం ప్రాణాలు అర్పించడంకంటె ఎక్కువ ప్రేమ ఏముంది"? అన్నాడు - యోహా 15,13. తానన్నట్లే సిలువమీద ప్రాణత్యాగం చేసికొన్నాడు. కనుక క్రీస్తు ఆచరణశుద్ధికల బోధకుడు.

2. క్రీస్తు శిష్యులను తనకు సాక్షంగా వుండమని ఆదేశించాడు - అచ 1,8. అనగా క్రీస్తు శిష్యులు అతని బోధలను వల్లెవేస్తే చాలదు. అతని జీవిత విధానాన్ని అనుసరించాలి. తామూ ఆ గురువులా ప్రేమజీవితం జీవించాలి. తొలినాటి శిష్యులు ఈలాంటి ప్రేమజీవితం జీవించారనే అపోస్తలుల చర్యలు అనే గ్రంథం చెపుతూంది. ఆదిమ శిష్యులు యెరూషలేములో ఉమ్మడిగా జీవించారు. ధనవంతులైనవాళ్లు తమ ఆస్తిపాస్తులను పేదలతో పంచుకొన్నారు. అందరూ కలిసి ఏకపంక్తిలో భోజనం చేసారు. దేవాలయంలో అందరూ కలసి ప్రార్థించారు. అంతా ఏకమై ప్రభువుని స్తుతించారు. కనుక ఆ ప్రేమ సమాజాన్ని జూచి యెరూషలేము పౌరులంతా మెచ్చుకొన్నారు. రోజురోజు క్రొత్త సభ్యులు వచ్చి ఆ సమాజంలో చేరిపోయారు - అచ 2, 44-47. ఎప్పడుగూడ నోటి మాటలతో చెప్పడంకంటె క్రియపూర్వకంగా చేసి చూపించడం ఉత్తమ బోధ.

3. ప్రభువుని క్షుణ్ణంగా అర్థంజేసికొన్నవారిలో పౌలు ఒకడు. అతడు తాను బోధచేయకపోతే సర్వనాశమౌతాననుకొన్నాడు - 1కొరి 9,16. ఐనా బోధించడం మాత్రమే తన బాధ్యత అనుకోలేదు. ఆచరణంకూడ తన విధి అనుకొన్నాడు. కనుకనే ఇప్పడు నేను కాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్పకొన్నాడు - గల 2,20, అనగా అతడు తన జీవిత విధానాన్ని క్రీస్తు జీవితవిధానానికి సరిపోయేలా దిద్దుకొన్నాడు. ఇంకో తావులో అతడు "నేను క్రీస్తుని అనుసరించినట్లే మీరూ నన్ను అనుసరించండి" అని కొరింతు విశ్వాసులను హెచ్చరించాడు- 1కొ 11,1. ఆచరణ లోపం కలవాడు ఈలా చెప్పకోగలడా? ఇంకా అతడు “సమయం అనుకూలంగా వుందా లేదా అనికూడ ఆలోచించకుండ ఎడతెగక బోధ చేయ"మని తిమోతీని ఆజ్ఞాపించాడు -2 తిమొ 42 ఐతే ఈ తిమోతి తాను క్రైస్తవ సమాజానికి ఆదర్శంగా వుండాలని గూడ హెచ్చరించాడు. మాటల్లో చేతల్లో ప్రేమను జూపించడంలో విశ్వాసంలో పవిత్ర జీవితం జీవించడంలో తిమోతి తన మందకు ఆదర్శప్రాయంగా వుండాలని చెప్పాడు - 1తిమొు 4, 12. కనుక పౌలు మంచి ఆదర్శం ఎంతో ముఖ్యమని భావించాడు అనుకోవాలి.