పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక వెలుగును గూర్చి. రబ్బయిలు మోషే ధర్మశాస్త్రమూ దేవాలయమూగూడ వెలుగులాంటివని బోధించారు – బరూకు 4, 1-2.శిష్యుడు లోకంమీద క్రీస్తు వెలుగును ప్రసరింపజేసి దానిని వెలిగించాలి. క్రీస్తు స్వయంగా జ్యోతి - యోహా 8,12. కనుక మనం అతని విలువలను లోకానికి అందీయాలి. అప్పడు లోకం ప్రకాశిస్తుంది. శిష్యులు మంచిపనులు చేస్తే వాటినిజూచి ప్రజలు పరలోకంలోని తండ్రిని కొనియాడతారు. కనుక మన మంచిపనులూ మంచిమాటలూ ఒక వెలుగులా లోకంలో ప్రసరించాలి. అప్పడేగాని మనం ఆప్రభువుకీ సాక్ష్యంగావుండం. నేల నాలుగు చెరుగుల వరకుగూడ అతనికి సాక్ష్యంగా వుండడం శిష్యుల పూచీ - అచ 8,1.

3. ధర్మశాస్తాన్ని మించిన నీతి

శిష్యుడు ధర్మశాస్రాన్ని మించిన నీతిని పాటించాలి. ఈ సత్యాన్ని ప్రభువు ఆరు ఉదాహరణలతో వివరించాడు - మత్త 5, 21-48. వీటిని క్రమంగా పరిశీలిద్దాం. 1. పూర్వవేదం హత్యను నిషేధించింది. కాని మనం కేవలం హత్యను విసర్జిస్తేనే చాలదు. శత్రువమీద కోపాన్ని గూడ మానుకోవాలి. అతన్ని భ్రష్టుడు, కొరగానివాడు మొదలైన తిట్లతో దూషించకూడదు - మత్త 5, 21-24. 2. మోషే వ్యభిచారాన్ని ఖండించాడు. కాని శిష్యుడికి ఇది చాలదు. ఒకోమారు వ్యభిచారానికి పూనుకోకపోయినా మన హృదయంలో చెడ్డకోరికలు కోరుకొంటూంటాం గదా? కనుక శిష్యుడు ఈలాంటి కోరికలనుగూడ అరికట్టగలిగి వుండాలి. కనుకనే ప్రభువు పరస్త్రీని హృదయంలో కామించడం గూడ పనికిరాదన్నాడు –5, 27-28. ఇక్కడ మోషే ధర్మశాస్త్రం కేవలం బాహ్యక్రియను నిషేధించింది. క్రీస్తు బాహ్యశుద్ధినేగాక అంతశుద్ధిని గూడ పాటించమన్నాడు. నైతిక జీవితానికి మూలకందం హృదయం. చెడ్డ కోరికలకూ మంచి కోరికలకూగూడ ఆది స్థానం. కనుక దాన్ని అరికట్టి చిత్తశుద్ధిని అలవర్చుకొన్నవాడే శిష్యుడు - మత్త 15, 19–20. 3. పూర్వవేదం కొన్ని పరిస్థితుల్లో భార్యా పరిత్యాగానికి సమ్మతించింది. కాని శిష్యుడికి ఈ పద్ధతి చెల్లదు. మోషేకి ముందు సృష్ణ్యాదిలో, అనగా ఆదిదంపతుల నాడు ఈ విధానం లేదు. తర్వాత మోషే యూదుల హృదయ కాఠిన్యాన్ని జూచి కొన్ని సమయాల్లో విడాకులు ఈయవచ్చని చెప్పాడు. కాని నరులు సృష్ట్యాదిలోవున్న పద్ధతికి రావాలని క్రీస్తు కోరాడు. కనుక అతడు విడాకులను పూర్తిగా నిరాకరించాడు. అందుచేత శిష్యుడు చిత్తశుద్ధితో తన భార్యపట్ల విశ్వాససహితంగా మెలగాలేకాని ఏదో నెపంతో ఆమెను పరిత్యజించడానికి సిద్ధంగా వండకూడదు - 5, 31-33.