పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదాహరణలనుబట్టి శిష్యుడు గురువునుండి విజ్ఞానాన్ని అర్ధింపగోరాడని తెలుస్తుంది. కాని క్రీస్తు శిష్యులు ఈలా విజ్ఞానం కొరకు తమ గురువుని ఆశ్రయింపలేదు. వాళ్లు క్రీస్తు వ్యక్తిత్వాన్ని చూచి మురిసిపోయి అతని శిష్యులయ్యారు. ఆగురువుకి తమ జీవితాలు అర్పించుకొన్నారు. అతన్ని ఓ ఆరాధ్యమూర్తిగా భావించారు. ఆ శిష్యులు తమ గురువు బోధలు నేర్చుకోవాలి అనుకోలేదు. అతని అడుగుజాడల్లో నడవాలి అనుకొన్నారు - అంతే క్రీస్తుబోధలు నేర్చుకోవడంకంటె అతన్ని అనుసరించడం వాళ్లకు ముఖ్యం. ఓ అతను మొదటవెళ్లి బంధువులవద్ద సెలవు తీసికొనివచ్చి తర్వాత క్రీస్తుని అనుసరిస్తానన్నాడు. ప్రభువు నాగటిమీద చేయిపెట్టి వెనక్కు చూచేవాడు తన శిష్యుడు కాలేడని చెప్పాడు. మరో అతన్ని యేసు తనవెంటరమ్మని పిల్చాడు. కాని అతడు మొదటవెళ్లి తన తండ్రిని పాతిపెట్టి వస్తానన్నాడు. బహుశః అతడు మళ్లావచ్చి వుండడు - లూకా 9, 59-62. ఇంకోమారు ఓ ధనికయువకుడు ప్రభువుని అనుసరిస్తా నన్నాడు. క్రీస్తు అతన్ని తన ఆస్తిపాస్తులు అమ్మి పేదలకు దానం చేసి తన వెంట రమ్మన్నాడు - మత్త 19,21. ఈలాంటి ఉదాహరణలన్నిటిలోను శిష్యులు క్రీస్తు ఉపదేశాలను వినాలనికాదు, అతన్ని వెంబడించాలని సూచింపబడింది. వాళ్లు తమ పూర్వ జీవితంతోను పూర్వసంబంధాలతోను తెగతెంపులు చేసికొని ఆ గురువుని అనుసరించాలని పేర్కొనబడింది. అనగా క్రీస్తు బోధలను నేర్చుకోవడంగాదు, అతని జీవిత విధానాన్ని అనుసరించడం శిష్యులకు ముఖ్యం. ఓ తావులో ప్రభువు శిష్యులను తననుండి నేర్చుకొమ్మన్నాడు - మత్త 11,29. కాని ఇక్కడ కూడ వాళ్లు నేర్చుకోవలసింది అతని బోధలుగాదు, ప్రవర్తనం. క్రీస్తు వినయమూ వినమ్రతా కలవాడని శిష్యులు నేర్చుకోవాలి. తాము ఆలాగే వినయంతో మెలగాలి. యాదరబ్బయిల శిష్యులూ గ్రీకు విద్వాంసుల శిష్యులూ విజ్ఞానార్ధనం కొరకు తమ గురువులను ఆశ్రయించారు. కాని క్రీస్తు శిష్యులు తమ గురువు జీవిత విధానాన్ని అనుసరించగోరారు. ఆ గురువుని వాళ్లు తమ సొంత తల్లిదండ్రులకంటె గూడ ఎక్కువ గౌరవంతో చూచారు - మత్త 10,37. అతనికి తమ సర్వస్వం అర్పించుకొన్నారు. అతనిపట్ల భక్తిభావం ప్రదర్శించారు.

శిష్యులకు క్రీస్తుపట్ల వున్న గౌరవాన్నీ పూజ్యభావాన్నీ అర్థం చేసికోవాలంటే వాళ్లపిలుపనే పరిశీలించాలి. ప్రభువు పేత్రూ అతని అన్నఅందైయా చేపలు పడుతుండగా చూచి వాళ్లను తనవెంట రమ్మని పిల్చాడు. ఆ యన్నదమ్ములు తమ వలలనుగూడ వదలిపెట్టి ఉన్నవాళ్లు వున్నపాటిన ఆ గురువు వెంట వెళ్లారు. ఆలాగే అతడు యోహాను అతనిఅన్న యాకోబు చేపలు పడుతుండగా చూచి వాళ్లనుకూడ పిల్చాడు. ఆ సోదరులు కూడ తమ ముసలి తండ్రినీ పడవనీ వదలిపెట్టి ఏమీ జాప్యం చేయకుండ గురువువెంట వెళ్ళిపోయారు - మత్త 4, 18–22.