పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

131వ కీర్తన చెప్పిన భక్తుడుకూడ భగవంతుణ్ణి సంరక్షకురాలైన తల్లితో పోల్చాడు.

నా హృదయం నిమ్మళంగాను
ప్రశాంతంగాను వుంది
పాలు మాన్పించిన శిశువు తల్లి రొమ్ముమీద
ప్రశాంతంగా పరుండివున్నట్లే
నా హృదయం నాలో నిమ్మళంగా వుంది.

తల్లిపాలు త్రాగే శిశువు పాలకొరకు అల్లరిచేస్తుంది. కాని పాలు మాన్పించిన శిశువు అలా అల్లరి చేయకుండా నిమ్మళంగా తల్లి రొమ్ముమీద పండుకొంటుంది. తల్లి సన్నిధిలో, తల్లి స్పర్శను అనుభవిస్తూ సురక్షితంగా ఉండిపోతుంది. ఇక్కడ కీర్తనకారుడు తన్ను శిశువుతోను దేవుణ్ణి తల్లితోను పోల్చుకొన్నాడు. దేవుడు తన్నుకాచి కాపాడుతుంటాడు గనుక తానూ దేవుని సన్నిధిలో ప్రశాంతంగాను సురక్షితంగాను ఉండిపోతానని చెప్పకొన్నాడు. దేవుడు తల్లిలాంటివాడినీ, తల్లి రక్షణనులాగే దేవుని రక్షణనుగూడ నమ్మవచ్చుననీ భావం. తల్లి వుంటే అండగదా! దేవుడివల్ల కూడ కొండంత అండ కలుగుతుందని పై ఉదాహరణల భావం.

5. గర్భిణిగా ప్రభువు

రెండవ యెషయా ప్రభువుని గర్భిణితో పోల్చాడు. చూలాలు బిడ్డను కన్నట్లుగా ప్రభువు యిస్రాయేలును మళ్ళా కంటాడని వాకొన్నాడు – 42,14.

ప్రభువు ఈలా పల్కుతున్నాడు
నేను దీర్ఘకాలం మౌనంగా వున్నాను
నోరువిప్పి మాట్లాడలేదు
నన్ను నేను నిగ్రహించుకొన్నాను
కాని యిప్పడు ప్రసవవేదన పడే స్త్రీలా అరుస్తున్నాను
గట్టిగా గాలి పీలుస్తూ రోజుతున్నాను.

యిప్రాయేలీయులు బాబిలోనియాలో వుండి మొరపెట్టగా యావే కొన్నాళ్ళ పట్టించుకోలేదు. మౌనంగా ఉండిపోయాడు. కాని యిప్పడు మనసుకరిగి ఆ ప్రజలను రక్షించడానికి పూనుకొన్నాడు.

అతని కరుణ అతనికి స్త్రీకిలాగ ఉద్వేగాన్ని పుట్టించింది. అతను బిడ్డనుకనే చూలాలు లాంటివాడు అయ్యాడు. ఆ ప్రభువుకూడ యిస్రాయేలును మళ్ళా కనాను దేశానికి కంటాడు. అనగా వారిని పాలస్తీనా దేశానికి తీసికొనిపోతాడని భావం. దేవుడు ప్రవాసంలోని యూదులపట్ల ప్రసవవేదన పడే స్త్రీలా ప్రవర్తిస్తాడని అర్థం.