పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తావుకి వచ్చారు. అక్కడ వాళ్ళకు మాంసం తినాలనే కోరిక పుట్టింది. మేము ఈజిప్టులో అది తిన్నాం, యిది తిన్నాం, ఇక్కడేమి దొరకడం లేదని సుమ్మర్లు పడ్డారు. మోషేమీద తిరగబడ్డారు. వారి తిరుగుబాటును జూచి ప్రభువు వారిని శిక్షింపబోయాడు. కాని మోషే ఆ ప్రజలను కాపాడమని దేవునికి విజ్ఞాపనం చేసాడు. "ప్రభూ! నీ సేవకుని ఇంతగా బాధపెడుతున్నావెందుకు? నేను నీయనుగ్రహానికి ఏల నోచుకోలేదు? నీవు ఈ ప్రజలను పరామర్శించే బాధ్యతను నానెత్తిన పెట్టావెందుకు? నేనేమైనా వీరిని కన్నానా యేమి? నేను వీరిని ఓదాదిలాగ రొమ్ముపై మోసికొనిపోయి నీవు వాగ్దానం చేసిన గడ్డకు చేర్చాలని నన్ను నిర్బంధం చేస్తున్నావెందుకు"? అని విన్నప్రంచేసాడు.

ఇక్కడ మోషే భావాల ప్రకారం, దేవుడు యిస్రాయేలును పరామర్శించడం అనే భారాన్ని తన నెత్తిపై బెట్టాడు. ఈ బరువుని మోషే మోయలేకపోతున్నాడు. యిస్రాయేలును తల్లిలా కన్నది అతడు కాదు. దాది పిల్లలను మోసికొని పోయినట్లుగా వారిని కనాను దేశానికి మోసికొనిపోవలసింది కూడ అతడుకాదు. మరి యెవరు? యిస్రాయేలును కన్నది యావే అనే తల్లే వారిని కనాను దేశానికి ఎత్తుకొని పోవలసిందికూడ యావే అనే దాదే. కనుక వారిని పరామర్శించవలసిన పూచీ యావేదికాని తనదికాదని భావం. తల్లి, దాది అతడేనని అర్థం.

ద్వితీయోపదేశ కాండం దేవునికి ఆడు గరుడపక్షిని ఉపమానంగా వాడింది - 32, 10-11.

గరుడపక్షి తన పిల్లలను ఎగిరింపగోరి
గూటిమీద కెగసి
వాటిని చాచిన తన రెక్కలమీద సురక్షితంగా నిల్పుకొన్నట్లే
ప్రభువు యిస్రాయేలును కాచి కాపాడాడు.

గరుడపక్షి పిల్లలకు ఎగరడం నేర్పించేపుడు వాటిని కాసేపు ఆకాశంలోకి ఎగిరిస్తుంది. అవి పడిపోబోతే వాటిని తన రెక్కలమీద నిల్పుకొంటుంది. ఈ రీతినే ప్రభువు యిప్రాయేలును ఈజిప్టునుండి రెక్కలమీద మోసికొనివచ్చి కనాను మండలానికి చేర్చాడని భావం. ఈలాంటి భావమే నిర్గమకాండ - 19,4 లో కూడ వస్తుంది. "గరుడపక్షి తన పిల్లలను రెక్కలమీద మోసికొనిపోయినట్లే నేనుగూడ మిమ్మ మోసికొనివచ్చి నా కడకు చేర్చుకొన్నాను." మామూలుగా బైబుల్లో గరుడపక్షి వేగానికి గుర్తుగా వుంటుంది. కాని పై యాలోకనాల్లో గరుడపక్షి మాతృత్వం, సంరక్షణ భావం సూచింపబడింది. కనుక యావేకూడ ఓ తల్లిలా యిప్రాయేలును సంరక్షించేవాడని అర్థం.