పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ యెషయా క్రీ.పూ. 550 ప్రాంతంలో బాబిలోనియాలోని ప్రవాసులకు దేవుని ప్రవచనాలు విన్పించాడు. ఆ కాలంలో యూదులు దేవుడు తమ్మ పూర్తిగా మర్చిపోయాడనీ, తాము దిక్కులేని బిడ్డల మయ్యామనీ వాపోతున్నారు. యెరుషలేమనే తల్లి తమ్ము వదలివేసిందనీ, ఇక తమకు తల్లి లేదనీ విలపిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రవక్త ఈ క్రింది ప్రవచనాన్ని చెప్పాడు - 49, 14-15.

ప్రభువు నన్ను పరిత్యజించాడు, నన్ను విస్మరించాడు
అని సియోను పల్కింది
స్త్రీ తన పసికందును మరచిపోతుందా?
తన ప్రేవున పుట్టిన బిడ్డమీద
జాలి జూపకుండా వుంటుందా?
ఒకవేళ ఆమె తన శిశువును మరచిపోయినా
నేను మాత్రం నిన్ను మరువను.

ఇవి పూర్వవేదంలోని అతి ప్రశస్తమైన వాక్యాల్లో కొన్ని పక్షి మృగజాతుల్లోగాని, మానవజాతిలోగాని తల్లలు శిశువును మర్చిపోకుండా జాగ్రత్తగా పోషిస్తారు. లేకపోతే ఆ పసిప్రాయంలో శిశువు ఏలా బ్రతుకుంది? కనుక భగవంతుడు తల్లి హృదయంలో తన బిడ్డపట్ల అపారమైన ప్రేమను పెట్టాడు. ఇక్కడ ప్రవక్త దేవునికి యిస్రాయేలీయుల పట్ల వున్నప్రేమను తల్లికి బిడ్డలపట్ల వుండే ప్రేమతో పోల్చాడు. ప్రభువు తల్లిలాంటివాడు. ఆ మాటకొస్తే, తల్లి ప్రేమ కంటె అతని ప్రేమ బలీయమైంది. ఒక వేళ తల్లి తన బిడ్డను మరచిపోయినా అతడు మాత్రం యిస్రాయేలీయులను మరచిపోడు. వాళ్ళ బాబిలోనియా దాస్యంలో వుండి దేవుడు తమ్ము మరచిపోయాడని విలపిస్తున్నారు. ఐనా దేవుడు వారిని ఎంతమాత్రం విస్మరించడు. వారిని ఆ దాస్యంనుండి విడిపించి తీరుతాడు. తల్లికిగూడ లేని ప్రేమ తనకుందని నిరూపిస్తాడు. ప్రజలు అతన్ని నమ్మాలి. ఇవి యెషయా పల్కిన వాక్యాలు. భగవంతుని ప్రేమనుగూర్చి చెప్పవలసి వచ్చినపుడు వీటిని మించిన వాక్యాలు పూర్వవేదంలో లేవు.

ఇంకా తల్లి బాధలోవున్న బిడ్డను అనునయించి ఓదార్చినట్లుగా ప్రభువు ప్రవాసంలో ఉన్న యూదులను అనునయిస్తాడు. ఈ సందర్భంలో యెషయా చెప్పిన పలుకులివి - 66,12 - 13.

యెరుషలేమనే తల్లి మీకు
చంటిబిడ్డలకులాగ పాలిస్తుంది
మిమ్మ తన చేతులలోకి ఎత్తుకొంటుంది