పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. తండ్రితల్లిగా దేవుడు

పవిత్ర గ్రంథం హీబ్రూలో రెహం, బేటెన్ అనే క్రియలు, గ్రీకులో స్పాంఘ్నిజొమాయి అనే క్రియను వాడింది. కరుణ ప్రేమ చూపడం, గర్భకోశం స్పందించడం అని ఈ పదాలకు అర్థం. తండ్రి భావమూ తల్లి భావమూ తెలియజేసేపుడు బైబులు ఈ మాటలను వాడుతుంది. అనగా నరులు దేవుడనే తల్లి లేక తండ్రి గర్భకోశం నుండి పుట్టినవాళ్ళనీ, వారిపై అతనికి అపారమైన ప్రేమ వుంటుందనీ భావం.

“దేవుడు మానవజాతిని సృజించాడు, తనను పోలునట్లుగా మానవుని చేసాడు. స్ర్తీ పురుషలనుగా మానవుని సృజించాడు" అంటుంది ఆదికాండం 1,27. ఈ వాక్యంలో భగవంతుడు తండ్రీ తల్లీ కూడ అనే భావం ధ్వనిస్తుంది. దేవుడు మానవజాతిని అంతటినీ తనకు పోలికగా సృజించినవాడు, నరులను స్త్రీ పురుషులనుగా జేసిన పరమాత్ముడు తానుకూడ ఏదోరూపంలో పురుషత్వమూ స్త్రీత్వమూ కలవాడు అనుకోవాలి. అనగా అతడు అందరికీ తండ్రీ తల్లీ కూడ.

యోబు గ్రంథం 38, 29-29 ఈలా ప్రశ్నిస్తుంది.
వానకు తండ్రి కలడా?
పొగమంచుకు జనకుడు కలడా?
మంచుకు తల్లి కలదా?
నేలపై పేరుకొనిన నూగు మంచుకు జనని కలదా?

అనగా వానా, మంచూ మొదలైన ఆదిమ పదార్థాలు నరులనుండి పుట్టినవి కావనీ పరమాత్ముడే వాటికి తల్లీ తండ్రీ అని భావం. ఈ విధంగానే కీర్తన 27,10 కూడ దేవుడు తండ్రి తల్లి అని చెబుతుంది.

నా తల్లిదండ్రులు నన్ను విడనాడినా
ప్రభువు నన్ను చేరదీసి పరామర్శిస్తాడు.
ఇక్కడ కీర్తనకారునికి దేవుడే అమ్మా నాన్న అని అర్థం.

2. ప్రేమగల తల్లిగా దేవుడు

యూదులు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బాబిలోనియాకు ప్రవాసులుగా వెళ్ళారు. అక్కడ ఫనోర శ్రమలు అనుభవించారు. భగవంతుడు తమ్ము విడనాడాడు అనుకొని దిగులుచెందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రవక్తలు, ఆ ప్రభువు ప్రేమగల తల్లిలాగ తన ప్రజలను ఆదరిస్తాడని చెప్పారు.ఆ సందర్భానికి ఆ బోధ అవసరమైంది.