పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసినట్లే ఆయా కార్యాలు చేస్తారు. క్రీస్తు నజరేతులో పెంపుడు తండ్రి యోసేపు లాగా వడ్రంగం చేసాడు. కాని పరలోకంలోని పితలాగ అద్భుతాలు చేసాడు. ఇంకా పరలోక తండ్రి గుణగణాలు క్రీస్తుకి కూడ వచ్చాయి. అతడు ఆ తండ్రిలాగే పవిత్రుడు, కరుణామయుడు, ప్రేమపూరితుడు. తండ్రికి అన్ని విధాల ప్రతిబింబం. కనుకనే మనం ఏనాడు చూడని తండ్రిని క్రీస్తు మనకు ఎరుకపరచాడు - 1,18. క్రీస్తులో తండ్రి పరిపూర్ణత అంతా యిమిడివుంది. కావున అతన్ని చూస్తే తండ్రిని చూచినట్లే - 14,9. అతడు తప్పితే తండ్రిని తెలియజేసేవాడు మనకు ఇంకొకడు లేడు.

సుతుడు త్రీత్వంలో తండ్రినుండి జనించినవాడు. కనుకనే అతడు తండ్రి దగ్గరికి తిరిగిపోయి అతని ఆనందంతో పాలుపొందాలని ఉవ్విళూరాడు. యేసు తాను తండ్రి వద్దకు వెళ్లవలసిన గడియ వచ్చిందని గ్రహించాడు - 13,1. ఆదిలొ వాక్కువుంది. ఆ వాక్కుదేవునివద్ద వుంది -1.2. దేవుని వద్ద వున్నవాక్కుతిరిగి దేవుని చెంతకే తిరిగిపోవాలని ఉవ్విళ్లూరింది.

క్రీస్తుకి తండ్రి ఆదర్శం, మాదిరి. అతడు ఈ లోకంలో తన తండ్రిలాగే జీవించాలని కోరకున్నాడు. శిష్యులను కూడా మీరు పరలోకంలోని తండ్రిలాగా పరిపూర్ణులు కండని ఆజ్ఞాపించాడు. మత్త 5,48. మనం కూడా క్రీస్తులాగే తండ్రినిచేరుకోవాలని తపించిపోవాలి. అతనిలాగే తండ్రి పరిపూర్ణతను సాధించాలి.

క్రీస్తు ఎల్లపుడు తండ్రికి విధేయుడు. ఆ తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఈ ప్రేమను ఆదర్శంగా బెట్టుకుని క్రీస్తుకూడ మనకొరకు అసువులు అర్పించాడు. మొదట మన రక్షణను కోరినవాడు తండ్రి. దాన్ని సాధించినవాడు కుమారుడు. అతడు అన్ని విధాల తండ్రికి విధేయుడు, ప్రతిబింబం. అతనికిలాగే మనకు కూడా ఆ పరలోకపిత పరమపూజ్యడు.