పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ రోజుల్లో ఏ యూదుడు కూడ యావే ప్రభువుకి అబ్బా అనే మాటను వాడ్డానికి సాహసించలేదు. అసలు యూదులు యావే అనే పేరుకూడ ఉచ్చరించేవాళ్ళు కాదు. దేవునిపట్ల గల గౌరవంచే అతనిపేరు పలికేవాళ్ళు కాదు, బైబుల్లో యావే అనే పేరు చదవవలసి వచ్చినపుడు దానికి బదులుగా "అదొనాయి" అని పలికేవాళ్లు (యజమానుడు) అలాంటివాళ్ళు దేవుణ్ణి నాన్నా - ఆబ్బా అని పిలవడానికి సాహసిస్తారా?

ఇంకో విషయంకూడ. తండ్రి అన్న అర్థంలో తెలుగులోకూడ "అబ్బ" అనే శబ్దం వుంది. కాని క్రీస్తు వాడిన అబ్బ శబ్దం అరమాయిక్ పదం.

అయితే క్రీస్తు తండ్రిని అబ్బా అని ఎందుకు సంబోధించాడు? అతడు పవిత్ర త్రీత్వంలోనే కుమారుడు. నరమాత్రుల కెవరికీ దేవునితో లేని సంబంధం అతనికుంది. కనుక దేవునిపట్ల తనకున్నదగ్గరి సంబంధాన్నీ, చనువునీ, ప్రేమనీ సూచిస్తూ అతడు ఈ శబ్దం వాడాడు. అతనికి ముందు ఏ యూదుడూ వ్యక్తిగతంగా దేవునికి ఈ శబ్దం వాడలేదు. కనుక క్రీస్తు సంబోధనం శిష్యులకు ఆశ్చర్యం కలిగించి వుండాలి.

కాని క్రీస్తుకి తన తండ్రిపట్ల గాఢమైన అనుభవం వుంది. అపారమైన ప్రేమవుంది. ఇప్పడు గెల్సెమని తోపులో అతడు ఫరోరశ్రమను అనుభవిస్తున్నాడు. అతనికున్న అనుభవాన్ని బట్టి బాధల్లో అతని నోటివెంట అ ప్రయత్నంగానే అబ్బా అనే మాట వెలువడింది.

క్రీస్తులో దైవ స్వభావం మానవ స్వభావం అనే రెండంశాలు వున్నాయి. అవి రెండూ అతనిలో వేరువేరుగానే పనిచేసాయి. కాని అతడు తన మానవ స్వభావంలోనే దేవుణ్ణి అబ్బా అని పిల్చాడు. ఐతే దేవుడు తనకు అబ్బ ఔతాడని మానుష క్రీస్తుకి ఏలా తెలిసింది? పవిత్రాత్మ సహకారం ద్వారా తండ్రి అతని మానుష స్వభావానికి వెలుగును ప్రసాదించి అతడు దేవుడు తనకు నాన్న అని గ్రహించేలా చేసి వుండవచ్చు. ఈ ప్రబోధంవల్ల క్రీస్తు చిన్నప్పటినుండే దేవుణ్ణి అబ్బ అని పిలుస్తూండవచ్చు. ఐతే ఆ ప్రబోధం అతనికి ఏ ప్రాయంలో కలిగిందో మనం రూఢిగా చెప్పలేం.

అతడు 12 ఏండ్ల యిూడున యెరూషలేము దేవాలయంలో వుండిపోయాడు. తల్లి మరియ అతని కొరకు గాలిస్తూ నాయనా! నేను నీ తండ్రి నీ కొరకు వెదుకుతున్నాం అంది. అందుకు ఆ బాలుడు మీరు నా కొరకు ఎందుకు వెదికారు? నేను నా తండ్రి పనిలో నిమగ్నుడైన యుండాలని మీకు తెలియదా అన్నాడు - లూకా 2, 48-49. ఈ వాక్యం భావం, మరియకు అప్పట్లో అర్థం కాలేదు. ఇక్కడ మరియ యోసేపును బాలుని తండ్రి అని సూచించింది. కాని బాలుడు తన తండ్రి పరలోకంలోని దేవుడేనని సూచించాడు. తాను ఆ దేవుని కార్యాల్లో నిమగ్నుడు కావాలని తెలియజేసాడు. కనుక ఈ సందర్భంలో అతడు తాను దేవునికి ప్రత్యేకమైన పద్ధతిలో కుమారుజ్ఞవుతానని గ్రహించాడు అనుకోవాలి.