పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకా దేవుని వరాలు అందరికీ, ఒక్కొక్కరికీ గూడ. అతడు ప్రతివ్యక్తికీ వానా వెల్లురూ దయచేస్తాడు. ఈ లోకంలో నేనొక్కడినే వున్నానన్నుపట్టించుకొని నా యక్కరలన్నీ తీరుస్తాడు. ఈ లోకంలో నేనొక్కడనే వున్నా క్రీస్తు కేవలం నా కొరకు చనిపోయేవాడు. దేవునికి ఒక్కొక్క నరునిమీద అంత ప్రీతి. ఈ సూత్రాన్ని గమనించి మనంకూడ అందరికీ సాయంజేయాలి.

5. దైవ కటాక్షమూ శ్రమలూ

ఓ వైపు దైవకటాక్షమున్నా మరోవైపు శ్రమలుంటాయి. దేవుని ప్రాణిపోషణ చాతుర్యం మన కష్టాలను తొలగింపదు. క్రీస్తు స్వయంగా శ్రమలు అనుభవించినవాడు. బాధలు అతని జీవితంలో ముఖ్యాంశం. నేడు మనంకూడ క్రీస్తు శ్రమల్లో పాలుపొంది రక్షణాన్ని సంపాదించుకోవాలని తండ్రి కోరిక. కనుకనే అతడు మనకు శ్రమలు పంపుతాడు.

దైవకటాక్షం ఈ లోకంలో మన కెదురయ్యే శ్రమలను తొలగించదు. మనం వాటివల్ల నాశమైపోకుండేలా చేస్తుంది, అంతే.

ప్రభువు శిష్యులతో "విరోధులు మీలో కొందరిని చంపుతారు. నా నామం నిమిత్తం అందరూ మిమ్ము ద్వేషిస్తారు. ఐనా మీ తలవెండ్రుక కూడ ఊడదు" అన్నాడు – లూకా 21, 16-17. ఈ మాటల భావమేమిటి? శ్రమలు మనలను నాశం చేయలేవు. శత్రువులు మనలను హింసించి బాధించవచ్చు, చంపివేయవచ్చు. ఐనా మనం ఏమీ కోల్పోము. ఉత్దాన దినాన అన్నీ తిరిగి పొందుతాం. మన తరఫున మనం విశ్వాసంతో జీవించాలి. శ్రమల వలన మనకు విజయమే కాని అపజయం కలగదని నమ్మాలి. క్రీస్తు బాధలతో చేరి మన బాధలు మనలను రక్షిస్తాయని అర్థంచేసికోవాలి.

5. అబ్బా అనుభవం

1. క్రీస్తూ - తండ్రీ

క్రీస్తుగెత్పెమని తోటలో తండ్రికి ప్రార్థన చేసాడు. "అబ్బా తండ్రీ! ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు. ఐనా నా చిత్తంగాదు. నీ చిత్తమే నెరవేరనీయి" అన్నాడు - మార్కు 14,36. ఈ "అబ్బా" అనే మాటకు నాన్న అని అర్థం. ఆ రోజుల్లో యూదుల చిన్నబిడ్డలు ఇంటిలో తమ నాన్నను అబ్బా అని సంబోధించేవాళ్ళు ఈలాంటి సంబోధననే క్రీస్తు తండ్రికి వాడాడు. కనుక ఈ పదం యావేపట్ల అతనికున్న చనువునీ, పరిచయాన్నీ సూచిస్తుంది.