పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రి మనలను ప్రేమిస్తాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడ్డి ప్రసాదించాడు. ఈ కుమారుని ద్వారానే మనం నిత్యజీవం పొందాలి - 3,16. మనం మొదట దేవుణ్ణి ప్రేమించలేదు. అతడే మొదట మనలను ప్రేమించాడు. మన పాపాల పరిహారం కొరకు క్రీస్తుని పంపాడు -1 యోహా 4,19.

ఇక తండ్రిలాగే క్రీస్తుకూడ మనలను ప్రేమించాడు. అతడు మనలను చివరిదాకా ప్రేమించాడు. అనగా మనలను తన శక్తికొలది ప్రేమించాడని భావం -11.8 భక్తుడు కూడ క్రీస్తుని ప్రేమిస్తాడు - 14,21. విశ్వాసులు తండ్రీ కుమారులను ప్రేమిస్తారు. కనుక లోకాన్ని ప్రేమించకూడదు - 1 యోహా 2,15. ఎందుకు? అది పాపపూరితమైంది కనుక.

2. ఒకరియందొకరు నెలకొని వుండడం

తండ్రీ కుమారులు ఒకరియందొకరు నెలకొని వుంటారు. ఆలాగే ఆ దివ్యవ్యక్తులు భక్తులయందూ, భక్తులు ఆ దైవవ్యక్తులందూ నెలకొని వుంటారు. దేవుని ఆజ్ఞలు పాటించేవారు దేవునియందూ, దేవుడు వారియందూ నెలకొనివుంటారు-1 యోహా 8,24. పవిత్రాత్మ ద్వారా ఈకార్యం జరుగుతుంది. తంద్రీకుమారులు ఏకకాలమందే వచ్చి విశ్వాసి హృదయంలో వసిస్తారు -14,23. విశ్వాసులు కూడ ఆ దైవవ్యక్తులందు వసిస్తారు - 17,21. ఈలా దైవ వ్యక్తులందు నెలకొని వుండేవాళ్లు కనుక విశ్వాసులు వారిలోవారు ఐక్యమై యుండాలి. ఇంకా, తండ్రి క్రీస్తుని ప్రేషిత సేవకు పంపాడు. ఆలాగే క్రీస్తుకూడ శిష్యులను ప్రేషిత సేవకు పంపుతాడు -20,21.

3. పరస్పర జ్ఞానం

తండ్రీ కుమారులకు పరస్పర జ్ఞానం వుంది. ఆలాగే విశ్వాసులకూ తండ్రికీ కూడ పరస్పర జ్ఞానం వుంటుంది. పితకు సమీపంలో వుండే సుతుడే తండ్రిని మనకు తెలియజేసాడు. కనుక దేవుడు మనకు తెలుసు - 1,18.

మనం క్రీస్తు గోర్ర్రెలం. క్రీస్తు భక్తులం. మనం ఆ ప్రభువుకి తెలుసు, అతడూ మనకు తెలుసు - 10, 14. ఈ పరస్పర జ్ఞానం తండ్రీ కుమారులకు వుండే పరస్పర జ్ఞానం లాంటిదే. తండ్రీ క్రీస్తూ మనలను ప్రేమతో తెలిసికొంటారు. మనంకూడ వారిని ప్రేమతో తెలిసికోవాలి.

4. పరస్పరం చెందివుండడo

శిష్యులు తండ్రికి చెందినవారు -17,6. ఆలాగే వాళ్ల క్రీస్తుకికూడ చెందినవాళ్లు - 13,1. తమకు చెందినవారిని తండ్రీకుమారులు దివ్యాహారంతో పోషిస్తారు-6,32. ఇక పిశాచం వారిని దక్కించుకోలేదు - 10,29.