పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. తండ్రి - కుమారుడు

41. బైబులు భగవంతుణ్ణి తండ్రితో ఉపమిస్తుంది. అతడు తండ్రి ఐతే యిస్రాయేలు పుత్రుడు, ఈజిప్టు నిర్గమంద్వారా యిస్రాయేలీయులు యావేబిడ్డగా రూపొందారు. ప్రభువు మోషేముఖాన “యిస్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్టపుత్రుడు. నన్ను ఆరాధించడానికి అతన్ని వెడలిపోనీ" అని ఫరోను ఆజ్ఞాపించాడు- నిర్గ 4,22. ప్రభువు తన ప్రజను ఈజిప్టునుండి ఈవలకు గొనివచ్చి తన కుమారునిగా జేసికున్నాడు. అప్పటినుండి యావే యూదులకు పెంపుడు తండ్రి, వారతనికి పెంపుడు బిడ్డ ఔతారు. యావే ఆ ప్రజను రక్షించడంద్వారా వారికి తండ్రి అయ్యాడు. కనుకనే ప్రవక్త యెషయా "అబ్రాహాము మమ్మ ఎరుగక పోయినా, యిస్రాయేలు మమ్ము అంగీకరింపక పోయినా, యావే! నీవే మా తండ్రివి, అనాదికాలం నుండి మా విమోచకుడవని నీకే పేరు" అని ప్రభువును వేడుకొంటాడు- 63, 16. తరువాత యూదులు యామే తమకు ఎలా తండ్రి అయ్యాడా అని దీర్ఘకాలం మననం చేసికొని దాస్యవిముక్తితో పాటు సృష్టి చేయడం ద్వారా కూడ అతడు తమ తండ్రి అయ్యాడని చెప్పకున్నారు. అందుకే యెషయా ప్రవక్త"ప్రభూ! నీవు మా తండ్రివి. మేము మట్టిమి. నీవు కుమ్మరివి. నీవే మమ్మలను చేసావు" అంటాడు 64,8.

42. రానురాను, భగవంతుని ఆజ్ఞల ప్రకారం జీవించే వాళ్లంతా అతని పుత్రులేననే భావం ప్రచారంలోనికి వచ్చింది. కీర్తనకారుడు "నా తల్లిదండ్రులు నన్ను విడనాడినా యావే నన్ను చేరదీస్తాడు. ప్రభూ! నీ మార్గన్ని నాకు బోధించు" అంటాడు - - 28,10. ఇక్కడ మార్గమంటే ఆయన ఆజ్ఞలే సామెతల గ్రంథకర్త "నాయనా! యావే శిక్షను తృణీకరింపవదు. ఆయన మందలించినపుడు విసుగుకోవదు. తండ్రి తన ప్రియకుమారుని చక్కదిద్దినట్లే యావే తన కిష్టుడైన నరుని మందలిస్తాడు" అంటాడు - 3,11-12. సోలోమోను జ్ఞానంకూడ "నీతిమంతుడే దేవుని కుమారుడైతే యావే అతని పక్షంపూని శత్రువులనుండి కాపాడడా?" అని అడుగుతుంది - 2,18. కనుక ఈ వాక్యాలన్నిటిలోను దేవుని ఆజ్ఞానువర్తియై చరించే నరుడు ఆయనకు బిడ్డలాంటివాడని భావం. కాని పూర్వవేదం ఈ భావాన్ని యిప్రాయేలు ప్రజలకు మాత్రమే వర్తింప జేసింది. యిస్రాయేలీయులు కాని అన్యజాతీయులు కూడ దేవుని బిడ్డలేనని పూర్వ వేదమెక్కడా స్పష్టంగా చెప్పదు.

43. రాజు ప్రత్యేకవిధంగా దేవుని కుమారుడనే భావం కూడ క్రమేణ ప్రచారంలోనికి వచ్చింది. దావీదునకు కలుగబోయే కుమారుడు సొలోమోనునుగూర్చి