పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభురక్తం. ఈ రక్తాన్నిచిందించడం వలన ప్రభువు నూతన నిబంధనను నెలకొల్పగలిగాడు. పూర్వ నిబంధనం ద్వారా యూదులు యావే ప్రజలైనట్లే, ఈ క్రొత్త నిబంధనం ద్వారా మనం క్రీస్తు ప్రజల మౌతాం. ఈలా ద్రాక్షసారాయం ఈ క్రొత్త నిబంధనను కూడ జ్ఞాపకానికి తెస్తుంది. రోజురోజు మన పీఠాలమీద కొనసాగే పూజబలి ఈ సత్యాన్నేసార్ధకం చేస్తుంది.

39. ద్రాక్షసారాయం విందును సూచిస్తుంది. దివ్యసత్రసాదానికి మోక్షానికి సంకేతంగా వుంటుంది. పూర్వవేద ప్రజలకు విందులోని ఓ ప్రధానభాగం ద్రాక్షసారాయం. అందుకే 28వ కీర్తన "నీవు నాకు విందును సిద్ధం చేసావు. నూనెతో నా తల అంటావు. నా పాత్ర నిండి పొర్లుతూవుంది” అంటుంది. ప్రభువు మనలను మోక్షపు విందుకు ఆహ్వానిస్తాడు. ఈ మోక్షపు విందులోకూడ ద్రాక్ష సారాయపు ప్రస్తావనం వుంటుంది. అందుకే క్రీస్తు "ఇది మొదలుకొని మీతోకూడ నా తండ్రి రాజ్యంలో క్రొత్తగా ద్రాక్షసారాయాన్ని పానంజేసిందాకా దానినిక నేను త్రాగను" అంటాడు - మత్త26,29. ఇక్కడ పేర్కొనబడిన ఈ ద్రాక్షసారాయము మరేమో కాదు. మోక్ష భాగ్యమే. యూదుల ఆచారాన్ననుసరించి ఇక్కడ ప్రభువు ఈ భావాన్ని వాడాడు అంతే. ఇక, ద్రాక్షసారాయం దివ్యసత్రసాదానికిగూడ సాంకేతికంగా వుంటుంది. పాత్రను పుచ్చుకున్నపుడు ప్రభురక్తాన్నే పుచ్చుకుంటున్నామని మన విశ్వాసం. ఈ భావంతోనే పౌలు ఎవడు అయోగ్యంగా ప్రభువు రొట్టెను భుజించి, ఆయన పాత్రను పుచ్చుకుంటాడో వాడు ప్రభు శరీరరక్తాలకు వ్యతిరేకంగా అపరాధం చేస్తాడు అని చెప్పాడు - 1 కొ 11,27. ఇలా ద్రాక్షసారాయం మోక్షాన్ని మోక్షపు విందును, దివ్యసత్ప్రసాదాన్ని సూచిస్తుంది.

40. మన దేశీయులు వైదిక కాలంలో సోమం అనబడే తీగనుండి తయారు చేయబడిన రసాన్ని సేవించేవాళ్లు, దీన్నేసోమరసం అనేవాళ్లు. ఈ సోమరసాన్ని యజ్ఞాల్లో వాడేవాళ్లు, కనుక అది పవిత్రమైంది. కాని యీ దేశీయులు ద్రాక్షసారాయానికి ఎప్పడూ అలవాటు పడలేదు. అసలిది ద్రాక్షలు సమృద్ధిగా పెరిగే దేశం కానేకాదు. పైగా ద్రాక్ష సారాయం సేవించడం ఈ దేశంలో తప్పగా భావింపబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పానీయాన్ని గూర్చిన పై బైబులు భావాలనూ, బైబులు సంస్కృతినీ మనం అట్టే మెచ్చుకోలేం. క్రీస్తే ఈ దేశంలో పుట్టిపెరిగినట్టెతే తన రక్తానికి సంకేతంగా ఏ పానీయాన్ని వాడేవాడో మనకు తెలీదు. కాని మన సంస్కృతికి అందుబాటులో వున్నా లేకపోయినా, ద్రాక్షసారాయాన్ని గూర్చి బైబులు సూచించే సంకేతాలను మాత్రం మనం చక్కగా అర్థం చేసికొనివుండాలి. లేకపోతే ప్రభు జీవితంలోని కొన్ని అంశాలు, విశేషంగా అతడు నెలకొల్పిన నూత్న నిబంధనలోని విశేషార్థం, దురవగాహమే ఔతుంది.