పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. అన్యజాతులవాళ్ళు దైవరాజ్యంలో ప్రవేశిస్తుంటే యూదులు వెలుపల ఉండిపోవలసి వచ్చింది. ఇప్పడు కూడ క్రైస్తవేతరులు మోక్షానికి పోతూంటే క్రైస్తవులు వెలుపల ఉండవలసి వస్తుంది, కేవలం మతమే మనలను రక్షించదు. వ్యక్తిగతమైన భక్తి విశ్వాసాలు కూడ కావాలి.

20. కాపపట్టని అంజూరం - లూకా 13,1-9

1. కాపపట్టని అంజూరానికి ఇంకొకయేడు గడువిచ్చారు. తోటమాలి పరామర్శ వలన కూడ అది కాపు పట్టకపోతే నరికినేస్తారు. అలాగే చాలయేండ్ల నుండి పరివర్తనం చెందని యిస్రాయేలుకి, క్రీస్తు బోధల ద్వారా పశ్చాత్తాపం చెందడానికి కొంతకాలం గడువిచ్చారు. ఇప్పడు పశ్చాత్తాపపడకపోతే నాశమైపోతారు.

2. అంజూరం సకాలంలో కాపుకి రాలేదు. ఎన్ని యేండ్లయినా యిస్రాయేలు ప్రజల్లో పశ్చాత్తాప ఫలాలు లేవు. చివరి కాలంలో క్రీస్తు బోధలు వినికూడ వాళ్ళ పరివర్తనం చెందడం లేదు. కనుక వారికి వినాశం తప్పదు. నేడు మనకూ అంతే. చివరిదాకా మనసు మార్చుకోనివాళ్ళ చివరన మార్చుకొంటారా? కనుక సత్వరమే పశ్చాత్తాప పడాలి.

3. అంజూరం తప్పేమిటి? సకాలంలో కాపుకి రాలేదు. అది తాను చేయవలసిన పని చేయలేదు. చేయగూడని చెడ్డపని చేస్తేనే గాదు, చేయవలసిన మంచిపని వదలివేసినా పాపమే. క్రీస్తు మంచిని చేస్తూ సంచరించాడు - అ.చ. 10,33, అతడు మంచిని చేయడంలో మనకు ఆదర్శం.

4. తోటమాలి అంజూరానికి గడువిప్పించాడు. నేను దాన్ని పరామర్శిస్తానన్నాడు. క్రీస్తే మన తోటమాలి. అతడు శ్రమజేసి మనచే పశ్చాత్తాప ఫలాలు కాయిస్తాడు. అతని సహనానికి హద్దులు లేవు. ఓపికతో మన పరివర్తనం కొరకు వేచివుంటాడు, ఆ ప్రభువుకి లొంగదాం.

21. ముఖ్యాసనాలు - లూకా 14, 7-11

1. విందుల్లో అతిధులు ఎన్నుకొన్న ఆసనాలను యజమానుడు మార్చవచ్చు. అలాగే పరలోక విందులో మనం ఎన్నుకొన్న స్థానాలను దేవుడు మార్చుతాడు. అక్కడ గొప్ప స్థానాలు దేవుడిచ్చేవి కాని మనం ఎన్నుకొనేవి కావు. కనుక మనం అతనిపై ఆధారపడాలి.

2. మనకున్నవన్నీ దేవుడిచ్చినవే. అసలు మన పుట్టుక కూడా అతని నుండే కనుక దేవుని ముందట మనకు వినయం తగుతుంది.

3. క్రీస్తు దేవుని కుమారుడై గూడ తన్నుతాను రిక్తుని జేసికొని సేవక రూపాన్ని దాల్చి నరుడుగా జన్మించాడు - ఫిలి 2,7. ఇతరుల మేలుకొరకు తన్ను తాను తగ్గించుకొన్నాడు. ఈ వినయం మనలోను వుండాలి.