పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. లాగుడు వల 13,47-50

1. ఇది కూడ ముందటి సామెత లాంటిదే. క్రీస్తు ఈ సామెతను చెప్పినపుడు అతని భావం ఇది. బెస్తలు లాగుడు వలతో అన్ని రకాల చేపలు పడతారు. ఆ పిమ్మట చెడ్డవాటిని తొలగించి మంచివాటిని ప్రోగుజేసికొంటారు. అలాగే దైవ రాజ్యంలో గూడ మొదట అన్నిరకాల నరులు చేరుతారు. లోకాంతంలో చెడ్డవారిని వేరుపరుస్తారు.

ఇక మత్తయి దీన్ని లిఖించినపుడు అతని భావం ఇది. బెస్తలు తాము పట్టిన చేపల్లో చెడ్డవాటిని తొలగించి మంచివాటిని ప్రోగుజేసికొంటారు. అలాగే లోకాంతంలో సన్మనస్కులు దుషులను మంచివారి నుండి వేరుపరచి శిక్షకు గురిచేస్తారు.

2. తిరుసభలో మంచివాళ్ళూ చెడ్డవాళ్ళూ కూడ ఉంటారు. ఎవరు ఏలాంటివాళ్ళి మనకు రూఢిగా తెలియదు. లోకాంతంలో దేవుడు చెడ్డవారిని వేరుపరుస్తాడు. తిరుసభ మాత్రం అందరికీ రక్షణావకాశం కలిగిస్తుంది. ఐనా అందరూ ఆ యవకాశాన్ని వినియోగించుకోరు. మన తరపున మనం చెడ్డవారిని జూచి ఆశ్చర్యపడకూడదు. వారిని విమర్శించకూడదు. ఓర్పుతో దేవుని తీర్పు కొరకు వేచి వుండాలి. పాపుల మనసు మార్చమని దేవుణ్ణి వేడుకోవాలి. ఇంకా, తిరుసభలో అందరూ మంచివాళ్ళే ఐతే మనకు దానిలో చేరే అవకాశం లభించి వుండకపోవచ్చు.

3. బెస్తలు చెడ్డ చేపలను వేరుజేసి తొలగిస్తారు. వాటి సంఖ్య తక్కువ. అనగా రక్షణం పొందనివాళ్ళ తక్కువ, పొందేవాళ్ళ ఎక్కువ. కనుక మనం ఆశాభావంతో జీవించాలి, కాని మన దుర్బుద్ధి వల్ల మనం ఆ తక్కువమందిలోనే చేరవచ్చు. కనుక భయభక్తులతో మన రక్షణం కొరకు కృషిచేయాలి - ఫిలి 2,12.

4. పెద్ద ఆస్పత్రిలో అన్నిరకాల రోగులు కన్పిస్తారు. అలాగే తిరుసభలో అన్నిరకాల పాపులు ఉంటారు. వారికి వైద్యం జేసి వారి రోగాలు తొలగించే పరమ వైద్యుడు క్రీస్తే - మత్త 9,12. మనం ఆ వైద్యుని సమిూపించి మన పాపరోగాన్ని వదిలించుకోవాలి. ఆ జబ్బుని అలాగే వుంచుకోగూడదు.

7. రాతి పునాది, ఇసుక పునాది 7,24-27

1. బుద్ధిమంతుడు రాతి పునాది మిూద ఇల్లు కట్టాడు. అది వానకూ వరదకూ తట్టుకొని నిల్చింది. మందమతి ఇసుక పునాది మిూద ఇల్లు కట్టాడు. అది వానకూ వరదకూ తట్టుకోలేక కూలిపోయింది. ఈలాగే క్రీస్తు బోధల ప్రకారం జీవించే శిష్యుడు జీవితంలో ఎదురయ్యే కష్టాలకు తట్టుకొని నిలుస్తాడు. అతని బోధలు పాటించని వాడు కూలిపోతాడు. ఇక్కడ ఉపమానం రెండు ఇండ్లతో గాదు, ఇద్దరు గృహనిర్మాతలతో