పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ఈ కథలు పేర్కొనే దైవరాజ్యం ఏమిటి? క్రీస్తే. అతడే మన నిధి, ఆణిముత్యం. ఆ ప్రభువుని దక్కించుకోవడం మన ప్రధాన ధ్యేయం. అతడుంటే చాలు, మనకు అన్నీ వున్నట్లే. అతని కొరకు అన్ని వస్తువులు త్యాగం చేయాలి. ఏ వస్తువు కొరకు కూడ అతన్ని త్యాగం చేయకూడదు.

5. ఈ కథలో ఈ యిద్దరు నరులు నిధి ఆణిముత్యం కొరకు తమకున్నదంతా అమ్మివేయడం ప్రమాదం కాదా? తర్వాత వాళ్లు నష్టపోరా? పోరు. ఆ నిధి ఆణిముత్యాల వల్ల వాళ్ళకు తాము పోగొట్టుకొన్న దానికంటె ఎక్కువ లాభాలే వస్తాయి. అవి అంత ఖరీదు గల వస్తువులు. నేడు మనకు కూడ దైవరాజ్యం వల్ల మనం పోగొట్టుకున్న దానికంటె ఎక్కువ లాభాలు చేకూరుతాయి.

6. కొందరు కొన్నాళ్ళ పాప జీవితం గడిపి ఆ పిమ్మట పరివర్తనం జెంది క్రీస్తు దగ్గరికి వచ్చారు. వాళ్ళకు ప్రభువు అమూల్యమైన నిధి అయ్యాడు. ఇంకా పునీతులు అన్నీ వదలి క్రీస్తుని స్వాధీనం చేసికొన్నారు. వీళ్ళకు ప్రభువు అన్ని విలువలకంటె పై విలువ అయ్యాడు. కాని పుట్టు క్రైస్తవులమైన మనకు క్రీస్తు విలువ తెలియదు. మనం అతన్ని అంతగా పట్టించుకోం. అతని కోసం మనం ఏనాడు, ఏ త్యాగం చేయలేదు. ప్రభువు కొరకు తమకు ప్రీతికరమైన వస్తువులను వదలుకొన్నవారికే గాని అతడు అనుభవానికి రాడు.

7. ఈ యిద్దరు నరులు తమకున్నదంతా అమ్మిన పిదపనే గాని తాము కోరిన గొప్ప వస్తువులను స్వాధీనం చేసికోలేదు. ఈలాగే మన స్వార్ణాన్ని జయిస్తేనే గాని మనకు దేవుడు దక్కడు. నా భద్రత, నా లాభం, నా పేరు, నా సుఖం, నా కీర్తి మొదలైనవన్నీ వదులుకొంటేనే గాని దేవుణ్ణి పొందలేం. ఆధ్యాత్మిక జీవితం యుద్ధరంగం లాంటిది. రోజూ మన స్వార్ణానికి వ్యతిరేకంగా పోరాడవలసిందే. ఈ స్వార్ణాన్ని ఒక్కరోజు లోనే, ఒక్కసారే త్యజించలేం. దానికి జీవిత కాలమంతా పోరాడవలసిందే.

8. జీతగాడు పొలం దున్నుతుండగా తలవని తలంపుగా నిధి దొరికింది. మోషే, పేత్రు, మత్తయి, పౌలు మొదలౌన వ్యక్తుల జీవితాల్లో గూడ అనుకోకుండా ప్రభువు దర్శనమిచ్చాడు. ఇప్పడు మన రోజువారి పనుల్లో గూడ ప్రభువు దిడీలున ప్రత్యక్షమౌతుంటాడు. అలా ప్రత్యక్షమైనపుడు మహా భాగ్యమనుకొని మనం అతన్ని స్వీకరించాలి.

9. దైవరాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనకున్నది వదలివేస్తే చాలు. ఆ వున్నది ఒక్కో వ్యక్తిని బట్టి ఎక్కువా కావచ్చు, తక్కువా కావచ్చు. ఇంకా ప్రతివాడికి దైవరాజ్యాన్ని సంపాదించుకొనేంత సౌమ్మ వుంటుంది. ఎవరూ నేను దాన్ని కొనుక్కోలేను అనలేరు. అసలు దైవరాజ్యానికి కచ్చితమైన వెల లేదు. ప్రతివాడు తనకున్నది వదలుకొని దాన్ని కొనాలి.