పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకారం ప్రభువు యిప్రాయేలనే ద్రాక్షతీగను ఐగుప్శనుండి పెకలించుకొని వచ్చాడు. దానిని పాలస్తీనా దేశంలో నాటాడు. అది మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. ఆమీద కాపు గాయడం మానివేసింది. అంచేత ప్రభువు ఆ తీగపై కోపపడి దాన్ని నాశంజేయబోతాడు, కీర్తనకారుడు "సైన్యములు కధిపతియైన ప్రభూ! శాంతించు! ఆకాశంనుండి వోమారు యిటుచూడు. ఈ ద్రాక్షతోటను పరికించు. ఈ మొక్కను దర్శించు. నీ కుడి చేతితో నాటిన ఈ తీగను కాపాడు” అని సవినయంగా మనవిచేస్తాడు - 80, 8-16. ఇది చాల సాంపయిన భావం అనాలి.

32. ఇక నూత్నవేదంలో యూద సమాజానికి మారుగా క్రైస్తవ సమాజం దేవునితోట ఔతుంది. యావేపట్ల, అతడు పంపే మెస్సీయాపట్ల భక్తినిజూపే శేషజనాన్ని యెషయా ప్రవక్త యావేనాటిన తోట అని పేర్కొన్నాడు.

33. క్రీస్తుకు కొంచెం పూర్వం వర్ధిల్లిన కుమ్రాను సమాజం "మేము యావే శాశ్వతంగా నాటిన తోట" అనుకున్నారు. సువార్తాకారుల భావాల ప్రకారం, ద్రాక్షతోట అంటే మెస్సీయాను అంగీకరించే నూత్నవేద ప్రజల సమాజం. ఇదే దైవరాజ్యం అనబడుతుంది. ఈ తోటకు యావే ప్రభువే కాపు, మార్కు 12, 1-12లో దుర్మారులైన తోటకాపుల వదంతం చెప్పబడింది. వీళ్లు యజమానుని కుమారునిగూడ పట్టుకొని చంపుతారు. కనుక భూస్వామి ద్రాక్షతోటను ఇతరులకు గుత్తకిస్తాడు. ఇక్కడ యీ దుర్మారులైన కాపులు యూదప్రజలు. దైవరాజ్య మనబడే తోట వీరినుండి తొలగింపబడుతుంది. క్రొత్త కౌలుదారులకు ఈయబడుతుంది. వాళ్లే క్రైస్తవులు. అనగా మెస్సియా వచ్చాక దైవ రాజ్యం యూదులనుండి క్రైస్తవులకు సంక్రమిస్తుంది అని భావం.

ఈలాగే ద్రాక్షతోటను వర్ణించే సామెతలు ఇంకారెండు ఉన్నాయి. మత్త 20, 1-16 ద్రాక్షతోటకు ఆలస్యంగా వచ్చిన పనివాళ్ళకూడ మొదటవచ్చిన కూలీలు పొందినంత వేతనం పొందారని చెప్తుంది. ఇక్కడ మొదటవచ్చిన పనివాళ్ళ యూదులు, ఆలస్యంగా వచ్చిన పనివాళ్ళక్రైస్తవులు. ప్రభువు ఆలస్యంగా వచ్చిన కూలివాళ్లను కూడ కరుణతో ఆదరిస్తాడు. అనగా ద్రాక్షతోట అనబడే దైవరాజ్యం క్రైస్తవులకుకూడ దక్కుతుందని భావం.

మత్తయి 21, 28–32 ఇద్దరు కుమారుల ఉదంతం చెప్తుంది. ఒకడు తోటకు వెళ్తానని వెళ్లలేదు. రెండవవాడు వెళ్లనని గూడ చివరకు వెళ్లాడు. యూదులు వెళానని చెప్పి గూడ వెళ్లనివాని లాంటివాళ్లు, క్రైస్తవులు వెళ్లనని చెప్పి పశ్చాత్తాపపడి వెళ్లినవాడి లాంటివాళ్ళు, అనగా నూత్న వేద ప్రజలు దైవరాజ్యమనే తోటలో పనిచేస్తారు. యూదులు పనిచేయరు. ఈలా యీ సామెతలు మూడూ నూత్నవేద ప్రజలు యావే ద్రాక్షతోట అనే భావాన్ని వ్యక్తం చేస్తాయి.