పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెందిందే. ఇక్కడే దేవుడు భర్త అంటే అతడు తన ప్రజలను గాఢంగా ప్రేమించేవాడు అని భావం. బైబులు భగవంతునికి ప్రజల విూద గల ఆదరణనూ ప్రేమనూ అర్థం చేసికోవడానికి ఈ ఉపమానం ఉపయోగపడుతుంది.

2. క్రొత్త బట్టలూ, కొత్త ద్రాక్షసారాయమూ - మత్త 9, 16-17.

బైబుల్లో బట్టలు, దుప్పట్లు, డేరాగుడ్డలు ప్రపంచాన్నీ యుగాన్నీ సూచిస్తాయి. ప్రాతబట్టను తొలగించి క్రొత్త బట్టను ధరించినట్లుగా భగవంతుడు ఈ ప్రపంచాన్ని నాశం చేసి మరో క్రొత్త ప్రపంచాన్ని సృజిస్తాడు - కీర్త 102,26. ఈ సామెతలో ప్రాత గుడ్డ పూర్వవేదాన్ని క్రొత్త గుడ్డ నూత్న వేదాన్ని సూచిస్తుంది. మెస్సీయా రాకడతో నూత్నయుగం, క్రొత్తశకం ప్రారంభమైంది. ఇక పూర్వవేదమూ మోషే ధర్మశాస్త్రమూ చాలవు. ప్రజలు ఇక విూదట ప్రభు బోధలను పాటించాలి.

బట్టల్లాగే ద్రాక్షసారాయం కూడ బైబుల్లో క్రొత్తతనానికి సంకేతం. జళ ప్రళయం తర్వాత క్రొత్త ప్రపంచంలో నోవా మొదటిసారిగా ద్రాక్షతోట పెంచాడు - ఆది 9,20. కనుక ఇక్కడ క్రొత్త ద్రాక్ష సారాయమంటే, క్రీస్తుతో ప్రారంభమైన క్రొత్తయుగం అని భావం.

మనలో ప్రాతతనం పోయి క్రొత్తతనం నెలకొనాలి. బైబుల్లో ప్రాతతనం పాపానికీ క్రొత్తతనం పుణ్యానికీ చిహ్నం. ఇక మనకు క్రొత్తతనాన్ని ఇచ్చేవాడు ప్రభువే. అతడు అన్నిటినీ క్రొత్తవాటిని చేసేవాడూ, నూత్న ప్రపంచాన్ని సృజించేవాడూను - ప్రక 21,5.

3. కోత = మత్త 9, 37.

బైబుల్లో కోత న్యాయనిర్ణయ దినాన్ని సూచిస్తుంది - మత్త 3, 12. కోతతో ప్రాతయుగం ముగిసి క్రొత్త యుగం ప్రారంభమౌతుంది. పంటను కోసి ధాన్యాన్ని సేకరించినట్లే మెస్సియా వచ్చినపుడు నీతిమంతులను సేకరిస్తాడు.

పౌలు గలతీయులకు వ్రాస్తూ నరుడు తాను వేసిన పైరునే కోసికొంటాడు అని చెప్పాడు - 6, 7. అనగా మనం ఏలాంటి జీవితం జీవిస్తే అలాంటి బహుమానం పొందుతాం. నరులు దేవుణ్ణి మోసం చేయలేరు గదా! మరి ఇక్కడ పాడు జీవితం జీవించి అక్కడ మోక్ష బహుమానం కోరుకొనేవాళ్ల తమ్ముతాము మోసగించుకొంటున్నారనే చెప్పాలి.

4. అంజూరపు చెట్టు = మత్త 24, 32-35.

పాలస్తీనా దేశంలో అత్తిచెట్టు వేసవిలో చిగిర్చి పూలు పూస్తుంది. మే, జూను నెలల్లో దీని పండ్లు లభిస్తాయి. కనుక చిగిర్చి పూలు పూసే అంజూరం వేసవిని సూచిస్తుంది.