పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు నాడు యూదుల్లో ఓ కథ ప్రచారంలో ఉండేది. మాయన్ అనే ధనికుడూ, ఓ పేద ధర్మశాస్త్ర బోధకుడూ ఇద్దరూ ఒకేదినం చనిపోయారు. ధనికుణ్ణి వైభవంగా భూస్థాపనం చేసారు. పేదవాడైన ధర్మశాస్త్రవేత్తను నిరాడంబరంగా పాతిపెట్టారు. కాని తర్వాత ధర్మశాస్త్రవేత్త శిష్యుడొకడు తన గురువు మోక్షపదంలో సుఖాలనుభవిస్తున్నటూ ధనవంతుడు స్వర్గానికి వెలుపల బాధల ననుభవిస్తున్నటూ దర్శనంలో చూచాడు. అనగా పరలోకంలో మన జీవితం తారుమారౌతుంది అని భావం. ఈ కథనే ఆధారంగా తీసికొని క్రీస్తు పై లాజరు ధనవంతుల కథను అల్లి ఉండవచ్చు. ఇంతవరకూ మొదటి సామెత.

ఇక, రెండవ సామెతను పరిశీలిద్దాం. ధనవంతుడు కష్ట దశలోవుండి భాగ్యదశలోవున్న లాజరువైపు పారజూచాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూడగలరుగాని ఒకరితావలోకి ఒకరు పోలేరు. ధనవంతుని బాధలు అతని విపరీతమైన దప్పిక వల్లనే అర్థం చేసుకోవాలి. లాజరు ఉన్నకాడ చల్లని నీటి పాయలు పారుతున్నాయి. యూదులు స్వర్గాన్ని సెలయేరులు పారే ఉద్యానవనంగా భావించారు. కనుక లాజరు గోటికొనతో ఒక చల్లని నీటిబొట్టును తీసి తన నాలుకమీద వదలితేచాలు ధనవంతుడు బ్రతికిపోతాడు. ధనికుడు అబ్రాహాముని “తండ్రి" అని సంబోధించి తనకు ఈ సహాయం చేయించవలసిందని బతిమాలాడు. ఈ యబ్రాహాము తన పుణ్యాలద్వారా స్వీయ జాతికి చెందినవారందరినీ మరులోకంలో కూడ ఆదుకొంటాడని యూదుల విశ్వాసం, అందుకే ఇక్కడ ధనికుడు అతన్ని పేరెత్తి పిలిచింది. అబ్రాహాము ధనికుణ్ణి సజాతీయుణ్ణిగా అంగీకరించి "కుమారా? అని ప్రతిసంబోధనం చేసాడు. కాని దైవశాసనాన్ని అబ్రాహాముకూడా మార్చలేడు. తిరుగులేని దైవశాసనమే ఇక్కడ దాటరాని అగాధం అని చెప్పబడింది. అక్కడ కష్టాలు అనుభవించినవాళ్ళు ఇక్కడ సుఖాలూ, అక్కడ సుఖాలు అనుభవించినవాళ్లు ఇక్కడ కష్టాలు అనుభవించాలి అన్నాడు అబ్రాహాము. అనగా ఇక్కడి పేదలందరూ మోక్షానికీ, ధనికులందరూ నరకానికీ వెళ్లారని భావంకాదు. ఈ లోకంలో నిర్దయతో ప్రవర్తించి భగవంతుని లెక్కచేయకుండా జీవించినవాళ్ళకు మరులోకంలో దండనా, ఇక్కడ భయభక్తులతో వినయంతో జీవించిన పేదలకు పరలోకంలో సంభావనా లభిస్తుందని భావం - అంతే.

ధనవంతుడు ఆశించినట్లుగా అబ్రాహాము సహాయం చేయలేక పోయాడు. అప్పడతనికి ఇంకో తలంపు వచ్చింది. ఇంటివద్ద అతనికింకా ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళూ అతనిలాగే ప్రాపంచిక జీవితం జీవించే భోగపరాయణులు. వాళ్లు కూడ తనవెంట ఈ నరకానికి రావడం తథ్యం. కనుక లాజరుని పంపి వాళ్ళకు బుద్ధి చెప్పించమని ధనవంతుడు అబ్రాహాముని కోరాడు. అనగా లాజరు ఏ కలలోనో కన్పించి తన తోబుట్టువులను మందలించాలని ధనవంతుని భావం. కాని మోషే, ప్రవక్తలూ