పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. వివరణం

ఇక్కడ రెండు సామెతలున్నాయి. మొదటి సామెత పరలోకంలో మన స్థితిగతులు తారుమారౌతాయి అని చెప్తుంది.ఇది 19 నుండి 23వ వచనం వరకు, రెండవ సామెత, సుఖభోగాలతోనే కాలం వెళ్ళబుచ్చగూడదని చెప్తుంది. ఇది 24 నుండి 31వ వచనం వరకు. సువిశేషాల్లో కొన్ని చోట్ల రెండు సామెతలు ఒకే సామెతగా కలసిపోయాయి.

మొదట తొలి సామెతను చూద్దాం. ఓ ధనవంతుడు పట్టుబట్టలు తాల్చి విందులూ వినోదాలతో మజాగా జీవిస్తుండేవాడు. అతని వాకిటనే ఓ బిచ్చగాడు పడివుండేవాడు. అతడు అవిటివాడు, చర్మవ్యాధితో బాధపడుతుండేవాడు. వాడు ధనవంతుని యింటికి వచ్చిపోతుండేవాళ్ళ వద్దనుండి కాణీ దమ్మిడీ అడుక్కొంటూ ఉండేవాడు. ఒక వైపు ధనవంతుడు మజాగా విందులారగిస్తూవుంటే మరోవైపు ఈ పేదవాడికి పిడికెడు కూడు గూడ కరువైపోయింది. ధనవంతుని బల్లవద్ద అతిథులు మస్తుగా భోజనంచేసి తమ వ్రేళ్ళకు చారు అంటుకోగా వాటిని రొట్టెముక్కల మీద తుడిచి ఆ ముక్కలనుబల్ల క్రింద పడవేసేవాళు, లాజరు ఆ రొట్టెముక్కలు దొరికినాచాలు వాటితోనైనా కడుపు నింపుకొంటాననుకొన్నాడుగాని వాడికి అవికూడ కరవైపోయాయి. ఊరకుక్కలు వచ్చి ఆ యవిటివాని పుండ్లు నాకి పోతుండేవి. అతనికి వాటిని అదలించే శక్తికూడ లేదు.

ఈ కథలోని ధనవంతుడు ఏ మాత్రమూ ఆలోచన లేనివాడు, భోగి. తినడమూ త్రాగడమూ సుఖభోగాలు అనుభవించడమూ ఇంతే అతనికి తెలిసింది, అతనికి దేవుని పట్ల భయభక్తులులేవు. పేదసాదల యెడల కరుణలేదు, కాని లాజరు భగవంతుని నమ్మకొని జీవించే నిరుపేద. ఇతని పేరునకు "దైవసహాయం" అని అర్థం. క్రీస్తు సామెతల్లో ఓ సొంత పేరంటూ ఉన్న పాత్ర ఇతడొక్కడే.

ఓ దినం ఈ యిద్దరూ చనిపోయారు. ధనికుణ్ణి ఆడంబరంతో వైభవంగా పాతిపెట్టారు. లాజరుని నిరాడంబరంగా పాతిపెట్టారు. కాని మరులోకంలో వాళ్ళ పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడ వైభవంగా జీవించిన ధనికుణ్ణి అక్కడ పాతాళంలో పాతిపెట్టారు. యూదులు నరకాన్ని పాతళ లోకంగా భావించారు. దానికి వాళ్ళ భాషలో "షెయోల్" అని పేరు. ఇది యొక్కడో భూగర్భంలో ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఇక ఆ ధనికునికి వెలుగూలేదు, భగవద్దర్శనమూ లేదు. లాజరుని మాత్రం మోక్షంలో అబ్రాహామునకు కుడిప్రక్కన విందుబల్ల వద్ద కూర్చోబెట్టారు. ఇక్కడ లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొన్నాడు లేక అతని ఒడిలో కూర్చున్నాడు అంటే అతని సరసన విందులో • పాల్గొన్నాడు అని భావం. యూదులు మోక్షాన్ని విందుగా భావించేవాళ్లు, అనగా లాజరుకు మహానందదశా, ధనవంతునికి మహాకష్టదశా సిద్ధించాయని భావం.