పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు ఈ సామెతను ముగిస్తూ "భూస్వామి వచ్చి ఆ కౌలుదార్లను శిక్షించి తోటను ఇతరులకు గుత్తకిస్తాడు" అని పల్మాడు. యూద నాయకులు ప్రభువు రాజ్యానికి తగిన ఫలితాన్ని ఈయడంలేదు. కనుక దైవరాజ్యం ఇక వాళ్ళకు దక్కదు. తండ్రి ఆ రాజ్యాన్ని మరొక ప్రజకు - క్రైస్తవులకు ఇస్తాడు, అనగా యూదులకు మారుగా క్రైస్తవులు దైవరాజ్యాన్ని స్వీకరిస్తారు.

4. అన్వయం

ఈ సామెతకు యెషయా ప్రవచనం 5, 1-7 ఆధారమని చెప్పాం. ఆ భాగంలో ప్రవక్త యిస్రాయేలును మంచికాయలు కాయని ద్రాక్షతోటతో పోల్చాడు. యావే ప్రభువు యిస్రాయేలు ప్రజను ఆదరంతో ఓ తోటలాగ పెంచాడు. ఆ తోట నుండి మంచి పండ్లను ఆశించాడు. కాని ఋతువు వచ్చినపుడు ఆ తోట మంచి పండు పండలేదు. అందువల్ల ప్రభువు కోపించి ఆ తోటను నాశం చేయించాడు - ఇది ప్రవక్త చెప్పిన కథ. యోగ్యమైన క్రైస్తవ జీవితం జీవించనపుడల్లా మనంకూడ ఆ కాయలు కాయని తోటలాగే తయారౌతాం. ప్రభువు శిక్షకు పాత్రుల మౌతాంగూడ.

4. యుక్తిగల గృహనిర్వాహకుడు - లూకా 16, 1-13

1. వివరణం

ఒక ధనవంతునికి ఓ గృహనిర్వాహకుడు ఉండేవాడు. యజమానుని ఇంటి విషయాలన్ని అతడే చూస్తుండేవాడు. అతడు యజమానునికి కార్యదర్శి వంటివాడు. కాని ఆ నిర్వాహకునిమీద ఫిర్యాదులు వచ్చాయి. కనుక యజమానుడు అతన్నిపనినుండి తొలగించి లెక్కలు అడగాలనుకొంటున్నాడు. నిర్వాహకుడు ఈ ప్రమాదం గుర్తించాడు. అతడు యుక్తిపరుడు. కనుక వెంటనే యజమానునికి ఋణపడి ఉన్న వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళ బాకీపడివున్నవస్తువులను తమ ఋణపత్రాలమీద తక్కువ మొత్తాలుగా వ్రాసికొమ్మని చెప్పాడు. ఆ బాకీదారులు సంతోషించి నూరుతూములనూ నూరు మణుగులనూ ఎనభైగా తగ్గించి వ్రాసి కొన్నారు. నిర్వాహకుడు ఉద్యోగాన్నికోల్పోయినంక ఈ బాకీదారులు అతడు చేసిన మేలునకు అతన్ని ఆదరించారు. యజమానుడు అతని యుక్తిని మెచ్చుకొన్నాడు. కనుక యూదనాయకులు కూడ ఈ గృహనిర్వాహకునిలాగే తెలివితో మెలాగాలి.

2. భావం

ఈ సామెత భావం ఏమిటి? ఆ గృహనిర్వాహకుడు ఋణగ్రస్తుల బాకీలను తగ్గించి యజమానుణ్ణి మోసం చేసాడు. అలాంటివాణ్ణి చూచి యజమానుడు మెచ్చుకొన్నాడు అని చెప్పబడింది. అతని మోసాన్ని మనంకూడ అనుకరించాలి అని భావమా?