పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాకోబు జాబు 5,7-8 మనం ప్రభువు రెండవ రాకడ కోసం వేచి వుండడాన్ని రైతు చూపే ఓపికతో ఉపమిస్తుంది. పంట కోసం రైతు ఓపికతో వేచివుంటాడు. ఓర్పుతో తొలకరి వానల కోసం ఎదురు చూస్తూంటాడు. అలాగే మనం కూడ సహనంతో ప్రభువు రెండవ రాకడ కోసం కనిపెట్టుకొనిఉండాలి అని ఆ వాక్యం భావం. కాని యిక్కడ దానంతట అదే పండి కోతకు సిద్ధమయ్యే పంట పొలం దైవరాజ్యానికి ఉదాహరణంగా ఉంటుంది.

2. అన్వయం

1 కొరింతీయులు 3,6లో పౌలు "నేను విత్తనం నాటాను. అపాల్లో నీళ్ళ పోసాడు. కాని మొక్కకు పెరుగుదల నిచ్చింది మాత్రం దేవుడే" అని చెప్పాడు. మన కృషి మనం చేస్తాం. కాని మన కృషికి ఫలితమూ బహుమానమూ ఇచ్చేవాడు ప్రభువే. మన తరపున మనం ఓపికతో వేచి ఉండాలి, అంతే. ఆధ్యాత్మిక రంగానికి భౌతిక రంగానికీ గూడ ఇదే నియమం వర్తిస్తుంది.

5. దాచబడిన ధనమూ, ఆణిముత్యమూ - మత్త 13,44-46

1. వివరణం

పూర్వం మన దేశంలో లాగే పాలస్తీనా దేశంలో గూడ నగలూ నాణాలూ భూమిలో పాతిపెట్టేవాళ్ళ పాలస్తీనా దేశం ఈజిప్టు బాబిలోనియా అనే రెండు పెద్ద సామ్రాజ్యాల మధ్య ఉన్న చిన్న దేశం. అందువల్ల ఆ దేశం ఎప్పడు యుద్ధభూమిగా పరిణమిస్తుండేది. సామాన్య జనులు భద్రత కోసం సొమ్ములనూ డబ్బులనూ భూమిలో పాతిపెట్టేవాళ్లు. కాని ఈలా పాతిపెట్టినవాళ్ళు కొంతమంది ఆ నిధిని తీయకుండానే గతించేవాళ్ళు కాలక్రమేణ అది మరెవరి కంటనో పడుతుండేది. యూదుల జానపద కథలు చాలవాటిల్లో దాగివున్న నిధిని గూర్చిన ప్రస్తావన వస్తుంది.

మన కథలోని నరుడు ఓ పనివాడి లాంటివాడు. అతడు ఓ భూస్వామి పొలం దున్నుతుండగా నేలలో పాతి ఉన్నకుండ టంగున ఫ్రెమోగింది. అతడు ఆతురతతో కుండను త్రవ్వి తీయగా దానిలో నాణాలూ సొమ్ములూ కన్పించాయి. ఆ పొలం అతనిది కాదు. కనుక అతడు గబగబా కుండను మళ్ళానేలలో పూడ్చి వేసాడు. ఎందుకంటే అది ఎవరి కంటా పడగూడదు. ఆ రహస్యము పొక్కగూడదు. ఆ విూదట ఇంటికి వెళ్ళి భూస్వామి వద్ద నుండి ఆ పొలాన్ని కొన్నాడు. దానితో ఆ నిధి అతనికి దక్కింది. అలా నిధి సంగతి తెలియజేయకుండా పొలం కొనడం న్యాయమా కాదా అనేది యిక్కడ ప్రశ్నకాదు. అతడు నిధిని సంపాదించడమే ఈ సామెతలోని ముఖ్యాంశం.

ఈ సామెత భావం ఏమిటి? ఈ సేద్యగాడు నిధిని చూచి ఎంతో సంతోషించాడు. ఆ నిధికి అతడు ఏంతో విలువనిచ్చాడు. చివరకు దాన్ని సొంతం చేసికొన్నాడు. అతడు