పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకా, ఈ సామెతలోని ప్రధాన పాత్ర రొట్టెలు అడగడానికి వచ్చినవాడు కాదు, వాటిని ఇచ్చినవాడు. క్రీస్తు భేదం చెప్పింది ఈ రొట్టెలిచ్చినవాడికీ దేవునికీని. ఈలాంటి పాడు నరుని నుండే సహాయం లభిస్తుంటే ఇంతకంటె మంచివాడైన దేవుని నుండి తప్పక సహాయం లభిస్తుందని క్రీస్తు బోధ, కనుక శిష్యులు నమ్మికతో దేవుణ్ణి అడుగుకొంటూండాలి — ఇది సామెత నీతి.

2. అన్వయం

కొందరు భక్తులు మనం భగవంతుని పట్ల ఓ బిచ్చగాడి లాగా ప్రవర్తించాలని నుడివారు. ఇది మంచి ఉపమానం, బిచ్చగాడు నమ్మకంతో పట్టుదలతో మన ఇంటిముందు వేచివుంటాడు. అలాగే మనం కూడ నమ్మికతో దేవుణ్ణి అడుగుకోవాలి. పట్టుదలతో ప్రార్ధన చేయాలి. అలా చేస్తే ప్రభువు తప్పకుండా మన మొర ఆలిస్తాడు, కీర్తనకారుడు కూడ “ఈ పేద నరుడు మొర్ర పెట్టగా ప్రభువు ఆలించాడు" అంటాడు - 34,6.

6. వితంతువు - న్యాయాధిపతి - లూకా 18, 1-8

1. వివరణం

ఓ న్యాయాధిపతి ఉండేవాడు. అతడు అధార్మికుడు. అతనికి దేవుని పట్ల భక్తి లేదు. తోడి నరులంటే లక్ష్యమూ లేదు. ఓ వితంతువు అతని వద్దకు వ్యాజ్యెం తెచ్చింది. ఆమెకు ఎవరో అపకారం చేసారు. కనుక తనకు న్యాయం చేకూర్చి పెట్టమని న్యాయాధిపతిని అడిగింది. కాని అతడు పట్టించుకోలేదు. న్యాయం ఆమె ప్రక్కనే వుంది గాని ఆమె ప్రత్యర్థి మాత్రం బలవంతుడు. అతనికి వ్యతిరేకంగా తీర్పు చెప్పే సాహసం న్యాయాధిపతికి లేదు. పైగా ఆమె వూరుపేరూ లేని పేదరాలు. తనకేమి లంచం గూడ ఈయలేదు. ఇక ఆమె గోడు తానెందుకు పట్టించుకోవాలి? లంచాలు తీసికొని న్యాయం చెరిచే న్యాయాధిపతులనూ, విధవల గోడులనూ పూర్వవేదం చాల తావుల్లో వర్ణిస్తుంది. ఈ సామెత గూడ అలాంటి సందర్భాలకు చెందిందే.

ఇక, ఈ వితంతువులో ఒక గొప్ప గుణముంది. ఆమె న్యాయాధిపతిని ఊపిరి పీల్చుకోనీకుండా తొందరపెట్టేది. నాకు న్యాయం జరిగించమని వేధించేది. చివరికి అతడు విసిగి వేసారిపోయాడు. ఆమె గోడు పడలేక తనకు ఇష్టం లేకపోయినాసరే ఆమెకు న్యాయం చెప్పాడు. ఆ వితంతువు పక్షమే నెగ్గేలా చేసి ఆమెను వదలించుకొన్నాడు.

ఈ విధవలాగే మనం కూడ నమ్మికతో, పట్టుదలతో దేవుణ్ణి అడుగుకోవాలని సామెత భావం, కాని దేవుడు ఈ యధార్మికుడైన న్యాయాధిపతిలాంటివాడా? ఈ సామెత దేవుడు ఈ యన్యాయపు న్యాయాధిపతిలాంటివాడని చెప్పదు, అతనికంటె భిన్నమైన వాడు అని చెప్తుంది. అనగా ఆ అధార్మికుడైన న్యాయాధిపతే నరుల మొర వింటూంటే, మంచివాడైన దేవుడు నరుల మొర ఇంకా అధికంగా వింటాడు గదా అని సామెత భావం. కనుక శిష్యులు పట్టుదలతో ప్రభుని మనవి చేసికోవాలి అని సామెత నీతి.