పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునిగిపోయి హృదయంలో భగవంతుని ఆరాధించుకోలేకపోతున్నారు. పైగా వీళ్లు తాము పుణ్యాత్ముల మనుకొనేవాళ్లు గనుక తమ పాపాలకు పశ్చాత్తాపపడరు. పాపక్షమాపణం పొందరు. కనుక వీళ్ళకంటె సుంకరులూ జారిణులూ మేలు. పరిసయులు నిత్యం దేవాలయంలో తిరుగుతున్నా దేవునికి దూరమయ్యారు. సుంకరులు దేవాలయానికి వెళ్ళకున్నాదేవుని సన్నిధిని జేరుతూన్నారు. కనుక పరిసయులు అవస్యం పశ్చాత్తాపపడాలనీ, పాపులనబడేవాళ్ళను కనికరంతో చూడ్డం నేర్చుకోవాలనీ క్రీస్తు భావం.

2. అన్వయం

స్నాపక యోహాను బోధించగా పరిసయులూ విన్నారు. సుంకరులూ విన్నారు. కాని సుంకరులు పశ్చాత్తాపపడి అతని నుండి జ్ఞానస్నానం పొందారు. ఐనా పరిసయులూ ధర్మశాస్త్ర బోధకులూ మాత్రం యోహానునీ అతని జ్ఞానస్నానాన్నీనిరాకరించారు-లూకా 7, 29-30. మనమే తెలివైన వాళ్ళమూ పుణ్యాత్ములమూ అనుకొంటే చాలదు. దేవుని యెదుట ఈలాంటి భావాలేమిూ అక్కరకురావు. ఆ ప్రభువుకి నచ్చేది మన హృదయశుద్దీ పశ్చాత్తాపమూను. కనుక నేను నీతిమంతుణ్ణి అనుకొని విర్రవీగేవాని కంటె పాపియైనా గూడ తన పాపాల కోసం పశ్చాత్తాపపడేవాడు దేవుని దీవెనలు పొందుతాడు. ఈ సత్యాన్ననుసరించి మన ప్రవర్తనను గూడ చక్కదిద్దుకోవాలి.

9. వైద్యుడు వ్యాధిగ్రస్తుల కొరకు - మార్కు 2, 17.

“17 యేసు ఇట్లనెను: వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడక్కరలేదు. నేను పాపులను పిలువ వచ్చితినిగాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు."

వివరణం

సామెతలు కథల్లాగ సాగిపోతాయి. కొంత విస్తృతిని గూడ కలిగివుంటాయి. కాని కొన్ని సామెతల్లో మాత్రం ఈ విస్తృతి వుండదు. అవి ఏక వాక్యంలాగ కన్పిస్తాయి. ఐనా ఈలాంటివి గూడ సామెతలే. ప్రస్తుత వాక్యం ఈ కోవకు చెందింది.

ఇక్కడ వ్యాధిగ్రస్తులంటే పాపూలూ సుంకరులూ మొదలైనవాళ్ళు. ఆరోగ్యవంతులంటే పరిసయులూ ధర్మశాస్త్ర బోధకులూను. క్రీస్తు వచ్చింది వ్యాధిగ్రస్తులు లేక పాపాత్ముల కోసం. అతడు వాళ్ళకు పరలోకం లోని తండ్రిని గూర్చి వివరిస్తున్నాడు. వాళ్ళపట్ల కనికరం జూపుతున్నాడు. ప్రజా నాయకులైన పరిసయులు అతని చర్యలను తప్పగా దీసికోగూడదు - ఇది భావం.

ముగింపు

ఈ కారుణ్యపు సామెతలన్నీటిని క్రీస్తు మొదట యూద నాయకులైన " పరిసయులకూ ధర్మశాస్త్ర బోధకులకూ చెప్పాడు : ఈ నాయకుల్లో మూడు ప్రధాన దుర్గుణాలు కన్పిస్తాయి.