పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. అన్వయం

1. కారుణ్యపు సామెతలన్నిటిల్లోలాగే దీనిలో గూడ భగవంతుని దయాగుణం ప్రధానమైంది. ఆ ప్రభువు జాలిగుండెలు కలవాడు. అతడు ఎవ్వరినీ కేటాయించడు, సజ్జనుల పైనీ దుర్జనులపైనీగూడ తన సూర్యుణ్ణి ఒకేవిధంగా ప్రకాశింపజేస్తుంటాడు. దుర్మారులకూ సన్మారులకూగూడ తన వరాన్ని ఒకేవిధంగా కురిపిస్తూంటాడు - మత్త 5,45. అందువల్ల దేవుడు చెడ్డవాళ్ళకుగూడ మేలు చేస్తున్నాడే అని మనమెప్పడూ బాధపడగూడదు. అలా ఉపకారం చేయడం భగవంతుని లక్షణం. నరుల్లొ లేందీ భగవంతునిలోవుందీ, దయాగుణం. ఈలాంటి సామెతలద్వారా మనం విశేషంగా ధ్యానించుకోవలసింది గూడ ఈ కారుణ్యగుణమే.

2. ఆ మొదట వచ్చిన కూలీలు చివరిజట్టు కూలీలను జూచి అసూయ పడిపోయారని చెప్పాం. ఈ యసూయాగుణం మనలను రకరకాల రూపాల్లో బాధిస్తుంది. వేరేవాళ్లు కాస్త పచ్చగా వుంటే ఓర్చుకోలేం. వాళూ మనంతటివాళ్లితే ఇక మనకేమి విలువ వుంటుందని బాధపడిపోతాం. ఈలాంటప్పుడు ఒక్కసత్యం గుర్తించాలి. మనం వృద్ధిలోకి వచ్చినా మన పోరుగువాళ్ళు వృద్ధిలోకి వచ్చినా అంతా భగవంతుని అనుగ్రహంవల్లనే. ఆ దయామయుడు తోడి జనాన్ని దీవించకుండా వుండాలి అనడానికీ అతని అనుగ్రహానికి హద్దులు పెట్టడానికీ మనమెవ్వరం? అందుచేత మనం ఇతరులతో పోల్చిచూచుకొని వాళ్ళంతటివాళ్ళయ్యారు ఇంతటి వాళ్ళయ్యారు అని అసూయతో వ్రుగ్గిపోగూడదు. మనం నమ్మికతో అడుగుకొంటేచాలు, ఆ ప్రభువు మనలనుగూడ దీవించి తీరతాడు. తప్పిపోయిన కుమారుని సామెతలోలాగే ఈ సామెతలోగూడ మొదటి భాగంకంటె రెండవ భాగం ముఖ్యమైంది. అందువల్ల ఈ రెండవభాగంలో వర్ణింపబడిన తోట యజమానుని కారుణ్యగుణమూ, అసూయా ఖండనమూ మళ్లామల్లా స్మరించుకోదగ్గవి.

6. క్షమింపనొల్లని సేవకుడు - మత్త 18, 21-35.

1. సందర్భం

ఓ మారు పేత్రు క్రీస్తునిజూచి పొరుగువారిని ఎన్నిసార్లు క్షమించాలి? ఏడుసార్లు క్షమిస్తే చాలా అని అడిగాడు. క్రీస్తు డెబ్బైయేడుసార్లు క్షమించమని సమాధానం జెప్పాడు. అనగా లెక్కలేనన్నిసార్లు క్షమించాలని భావం. ఆదికాండం 4, 24లో లేమెక్ అనునతడు తన్నుకొట్టినవాణ్ణి డెబ్ఫైయేడు రెట్ల అదనంగా శిక్షించి పగతీర్చుకొన్నానని ప్రగల్భాలు పలికాడు. కాని నూతవేదంలో ఈలాంటి పగకు ఆస్కారంలేదు. క్రీస్తు శిష్యులు ఒకరినొకరు క్షమిస్తూండాలి అనడానికి ఈ సామెత చెప్పబడింది. ఈ సామెతను మత్తయి ఒక్కడే ఉదాహరించాడు.