పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గూడ ఒక దీనారమే చెల్లించాడు. ఆ మొదటివాళ్ళకు కడుపు మండింది. మండదా మరి? వాళ్ళ కోపానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, ఈ చివరన వచ్చినవాళ్లు గంటకాలం పనిజేస్తే వాళ్లు పండ్రెండు గంటలు పనిజేసారు - ఉదయం ఆరునుండి సాయంకాలం ఆరుదాకానూ. రెండవది, ఈ చివరి జట్టవాళ్ళ సాయంకాలపు చల్లగాలిలో పనిజేస్తే వాళ్లు మధ్యాహనపు మండుటెండలో చెమటోడ్చి పని జేసారు. మరి యిప్పడు గుర్రాన్నీ గాడిదనీ ఒకగాట కట్టివేయడం ఏమి ధర్మం?

ఇదంతా ద్రాక్షతోటలో జరిగిన వ్యవహారం. యజమానుడు అక్కడలేడు. ఇంటి దగ్గర ఉన్నాడు. కనుక వాళ్లు ఆ చివరి జట్టవాళ్ళని ఇద్దరుముగ్గురిని బలత్కారంగా తమవెంట దీసికొని పెద్దగా అరచుకొంటూబోయి యజమానుని యిల్లుచేరి అక్కడ గొడవబెట్టారు. యజమానుడు వాళ్ళ ఫిర్యాదు విన్నాడు. ఆ మరా నాయకుణ్ణిజూచి కాపు "ఓయి! నేను మీకేమి అన్యాయం జేసాను? మీకు ఒక దీనారమే యిస్తానని ఒప్పకొన్నాను. ఒప్పకొన్నంత యిచ్చాను. నేను దయగలవాణ్ణి కనుక ఈ చివరిజట్టవాళ్ళకి గూడ ఒక దీనారమిచ్చాను. దానివల్ల మీకు వచ్చిన నష్టమేమిటి? నా మంచితనాన్ని జూడగా మీకు కన్ను కుట్టింది కాబోలు! మీకూలి మీరు తీసుకొని ఇక వెళ్ళిపొండి" అన్నాడు.

ఇక్కడ భావం ఏమిటి? ఆ రోజుల్లో ఒకరోజు కూలి ఒక దీనారమని చెప్పాం. ఒక దీనారమైనా దొరికితేగాని యింటివద్ద కూలివాని కుటుంబానికి పొట్టగడవదు. చివరి జట్టవాళ్లు ఒక దీనారం కూలికి అరులుగారు. ఐనా ఒక దీనారంతో వెళ్ళకపోతే ఇంటివద్ద వాళ్ళ భార్యాపిల్లలు వస్తుండవలసిందే. అందుచేత ఆ కాపు ఎంతో దయగలవాడు కనుక ఒక గంటకాలమే పనిజేసినా వాళ్ళకుగూడ కుటుంబ వేతన మిప్పించాడు. కాని అతని ఉదారగుణాన్ని జూచి మొదట వచ్చినవాళ్ళు అసూయపడ్డారు. కండ్లల్లో నిప్పలు పోసికొన్నారు. వాళ్ళ జీతం వాళ్ళకి ముట్టినా వాళ్ళూ కడపట వచ్చినవాళ్ళూ సమానమైతే ఎలాగ? వేరే వాళ్లగూడ మనపాటి వాల్టైతే ఇక మన గొప్పేముంది? అందుకే వాళ్ళ వాగుడూ, గొణుగుడూను.

ఇక సామెత భావమిది. ఇక్కడ తోటయజమానుడు పరలోకపు తండ్రినీ, మొదట వచ్చిన కూలీలు పరిసయులనూ, కడపటవచ్చిన కూలీలు సుంకరులనూ సూచిస్తారు. తోటయజమానుడు కడపటవచ్చిన కూలీలమీదా వాళ్ళ కుటుంబాల మీదా జాలిజూపినట్లే పరలోకంలోని తండ్రి సుంకరుల మీదా పాపాత్ములమీదా జాలిజూపుతాడు. వాళ్ళు అరులు కాకపోయినా తన రక్షణనూ తన మోక్షసామ్రాజ్యాన్నీ వాళ్ళకూ ప్రసాదిస్తాడు. ఈలా ప్రసాదించేదిగూడ తన ప్రతినిధియైన క్రీస్తు ద్వారా. కనుకనే క్రీస్తు ఈ పాపులను ఆదరిస్తూంది. అందుచే ఆ మొదటి జట్టు వాళ్ళలాగే, పరిసయులు క్రీస్తుమీద గొణగకూడదు.