పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్యదైవాల వెంటబోయినా - విడనాడడు. ప్రభువు తన వధువుపట్ల క్షణకాలం మాత్రమే కోపం జూపుతాడు. కాని ఆదరంతో ఆమెను మల్లా చేరదీస్తాడు. నిశ్చలమైన పర్వతాలు కదలితే కదలవచ్చుగాక; తిప్పలు పట్టదప్పుతే తప్పవచ్చుగాక. ప్రభువుకృపమాత్రం తనవధువును విడనాడడు. అతడామెతో చేసికొనిన క్రొత్త యొడంబడిక ఏనాటికి గతింపదు. అతడు తన వధువుపట్ల నిత్యం జాలిజూపుతునే వుంటాడు" -54, 5–10. ఈ వాక్యాలను పూర్వ వేదమనే సముద్రంలో నుండి యేరితీసిన ఆణిముత్యాలనాలి! పాఠకులు ఈ పలుకులను నిదానంగా అవధానంగా మననం చేసికోవాలి.

20. ప్రభువు యెషయా ప్రవక్తద్వారా యింకా యిలా సెలవిచ్చాడు. "యువకుడు కన్యను పెండ్లియాడినట్లే నీదేవుడైన యావేకూడ నిన్ను పరిణయమాడుతాడు. వరుడు వధువును జూచి సంతసించినట్లే ప్రభువుగూడ నిన్నుజూచి సంతసిస్తాడు” 62,5. పరమగీతం గ్రంథం కూడ ఈలాంటి భావాలనే సూచిస్తుంది. ఓ ప్రియుడు, అతని ప్రియురాలు; ప్రియుడు ప్రియరాలిని గాఢంగా ప్రేమిస్తాడు. ప్రియురాలు ప్రియనితో ఇలా అంటుంది "నన్నునీ హృదయంమీద ముద్రవేసికో ప్రేమ మరణమంత బలమైంది. దాన్నెవరూ ఆపలేరు. అది అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది. నదులు ప్రేమాగ్నిని చల్లార్పలేవు. ప్రవాహాలు ప్రేమజ్వాలను ముంచి వేయలేవు. ఆ ప్రేమను మనం సంపాదింపలేము. నరుడు తన ఆస్తిబాస్తులన్నిటినీ సమర్పించుకొన్నా దాన్ని కొనలేడు. పైగా తిరస్కరాన్నే పొందుతాడు" - 8, 6.8. ఇది మనుషప్రేమ. ఈ ప్రేమ దైవప్రేమకు పోలికగా వుంటుంది. నరుడు తన భార్యను ప్రేమించినట్లే ప్రభువు కూడ తన వధువైన యిస్రాయేలును మిక్కిలి అనురాగంతో ఆదరిస్తాడు.

21. జ్ఞానగ్రంథకారులు మరో భావాన్నిగూడ ప్రవేశపెట్టారు. జ్ఞానము దేవుని కూతురు - సామె 8,22. ఈ జ్ఞానం నరులతో వుండిపోవాలని ఉబలాట పడుతుంది. నరునికి భార్య ఔతుంది - సీరా 15,2. ఈ జ్ఞానమనే భార్యను పొందినవాడు దేవుని స్నేహితుడౌతాడు - సొలో జ్ఞా 7, 14. ఉత్తముడైనవాడు ఈ జ్ఞానాన్ని అభిలషించాలి, ప్రేమించాలి, వధువునుగా స్వీకరించాలి - 8,2. ఆమెతో కూడిమాడి వుండాలి - 8,9, దేవుడు మాత్రమే ఆమెను నరుని కియ్యగలడు - 8,21. పరిశుద్ధాత్మతోపాటు ఈ జ్ఞానాన్నికూడ దేవుడు తన భక్తులకు అనుగ్రహిస్తూంటాడు - 9, 17. ఈ జ్ఞానవధువు తాను వరించిన వాళ్లకు మితత్వమూ, వివేకమూ, ధైర్యమూ, మొదలైన పుణ్యాలను ప్రసాదిస్తుంది. నరులకు వీనికంటె లాభదాయకమైన వేవీలేవు- 8,7. ఈలా జ్ఞానం ఓవధువులాగ నరుని వరిస్తుంది అన్నారు జ్ఞానగ్రంథకారులు. పూర్వవేదం పేర్కొనే ఈ జ్ఞానం నూతవేదంలో క్రీస్తే, “క్రీస్తు దేవుని శక్తి దైవజ్ఞానం" అంటాడు పౌలు - 1 కొ 1,24.