పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన పుణ్యకార్యాలను వల్లించుకోలేదు. అసలతనికి తాను పాపాత్ముణ్ణి అనుకోవడం తప్పితే వేరే తలంపు తట్టనేలేదు. కావున అతడు తన పుణ్యకార్యాలమీద గాక, భగవంతుని కరుణమీద ఆధారపడి "ప్రభో! ఈ పాపిని మన్నించు" అని ప్రార్ధించాడు. వినయంతో గూడిన అతని యీ ప్రార్థన భగవంతునికి ప్రియపడింది. నమ్మికతో తన చేతుల్లోనికి సమర్పించుకొన్నవాళ్ళని ఆ ప్రభువు త్రోసివేస్తాడా? పరిసయుడు పీఠానికి దాపలో నిలిచినా హృదయశుద్ధి లేనివాడు గనుక దైవసాన్నిధ్యానికి దూరమయ్యాడు. సుంకరి పీఠానికి దూరంగా నిలిచినా దైన్యభావం గలవాడు గనుక దైవసాన్నిధ్యానికి చేరువయ్యాడు. బైబులు భగవంతుడు గర్వాత్మలను అణగదొక్కి దీనులను ఆదరించేవాడు - యాకో 4,6.

క్రీస్తు నోటినుండి ఈ సామెతను వింటున్న పరిసయులు పరలోక ప్రభువు ఆ పరిసయని మన్నించి సుంకరిని తిరస్కరిస్తాడని అనుకొన్నారు. వాళ్ళ తలపోతల ప్రకారం దేవుడు పాపాత్ముల మొర ఆలించడు. ఆలించగూడదు గూడ. ఒకవేళ సుంకరిగూడ మన్నింపబొందితే, అది కేవలము ఆ పరిసయని ప్రార్ధనా ఫలితంగానే, కాని పరలోకపు తండ్రి సుకరిని మన్నించి పరిసయుని తిరస్కరించాడని క్రీస్తు చెప్పేటప్పటికల్లా శ్రోతలైన పరిసయులంతా నిశ్చేష్ణులయ్యారు. ప్రభువు పరిసయుల గర్వభావాన్ని అణచివేయడం కోసం ఈ సామెతలో దేవుని కారుణ్యాన్ని వర్ణించి చెప్పాడు. కాని గ్రుడ్డి ప్రజలను గోతిలోనికి నడిపించుకొని పోతున్న ఆ గ్రుడ్డి నాయకులు ప్రభువు పలుకులను ఆదరించలేదు.

ఈ సామెత భావం ఏమిటి? కొందరనుకొన్నట్లు ఇందలి ముఖ్య విషయం వినయమూగాదు, జపమూగాదు, మరి పాపాత్ములపట్ల భగవంతుడు జూపే కరుణ్యం ఇక్కడ ప్రముఖాంశం. ఆత్మశుద్ధితో పశ్చాత్తాప హృదయంతో తన్ను సమీపించే పాపాత్ములను భగవంతుడు నిరాకరించడు. కరుణతో వాళ్ళ తప్పిదాలను క్షమిస్తాడు. పరలోక పితయొక్క ఈ కృపాగుణాన్నే క్రీస్తు గూడ తన చర్యలందు వ్యక్తం జేస్తున్నాడు. కనుక పరిసయులు క్రీస్తు కారుణ్యాన్ని తప్పగా ఏంచరాదు - ఇది సామెత భావం.

3. అన్వయం

1. "ప్రభో! పాపినైన నామీద కృపజూపు" అనే యీ సుంకరి ప్రార్థనం 51వ కీర్తనం మొదటి చరణం నుండి గ్రహించబడింది. ఇదే కీర్తన 19వ చరణంలో "ప్రభో! నేను సమర్పించుకొనే బలి పశ్చాత్తాప హృదయమే. పశ్చాత్తాపంతో సంతాపపడే హృదయాన్ని నీవు అనాదరం జేయవు" అని చెప్పబడింది. ఇంతకంటె యోగ్యమైన పశ్చాత్తాప జపం మరొకటి లేదు. ఈలాంటి ప్రార్థలనద్వారా భక్తుడు ప్రభువు నుండి పాప క్షమాపణం అడుగుకోవాలి. అప్పుడు కరుణామయుడైన భగవంతుడు ఆ సుంకరి పాపాలను క్షమించినట్లే మన పాపాలను గూడ క్షమిస్తాడు. భక్తుని పశ్చాత్తాపమూ భగవంతుని కారుణ్యమూ - ఇది ఈ సామెతలోని ప్రధానాంశం.