పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నట్లేగదా? అందుచేత వాళ్లు తాము చేసిన పుణ్యకార్యాలే తమ్ము రక్షిస్తాయనీ వాటివల్లనే తాము నీతిమంతులమాతామనీ, ఇక భగవంతుని కారుణ్యంతోగాని వరప్రసాదంతోగాని అవసరము లేదనీ భావించారు. భవనం పునాదులమీద నిల్చినట్లు తామూ తమ సత్కార్యాలమీద నిలుస్తామనుకొన్నారు. ఇక సుంకరులూ పాపాత్ములూ ధర్మశాస్త్రం పాటించరు గనుక వాళ్ళకు రక్షణం లేదు. కనుక పరిసయులు ఈ వర్గంవాళ్ళను చిన్నచూపు జూస్తూ తానే పుణ్యాత్ములమన్న భావంతో విర్రవీగుతుండేవాళ్ళ ఈలాంటివాళ్ళ నుద్దేశించి క్రీస్తు ప్రస్తుత సామెత చెప్పాడు - 18,9.

2. వివరణం

ప్రార్థనం జేసికోవడానికై ఇద్దరు జనులు దేవాలయానికి ఎక్కి వెళ్ళారు. యెరూషలేం దేవాలయం కొండమీద వుంది. ఉదయం తొమ్మిదవగంటా సాయంకాలం మూడవ గంటా యూదుల ప్రార్థనా సమయం. ఇక్కడ ఈ ఇద్దరూ వెళ్ళింది మూడవగంట సమయంలో గావచ్చు. నిలుచుండి ప్రార్ధించడం యూదుల ఆచారం, యెరూషలేము దేవాలయంలో చాలా భాగాలున్నాయి. పరిసయుడు గార్భాగారం ముందుగల మొదటి తెరదాకా పోయివుండవచ్చు. వాళ్లు అంతవరకూ పోవచ్చు సుంకరులు, స్త్రీలు లేక అన్యమతస్తులు నిలుచుండే తావుదాకా మాత్రమే వెళ్ళేవాళ్లు, కనుక ఈ సుంకరిగూడ ఆతావు దాటి ముందుకు అడుగుపెట్టి వుండడు.

పరిసయని ప్రార్థనకీ సుంకరి ప్రార్థనకీ గల తారతమ్యం ఈ సామెతలో చక్కగా చిత్రించబడింది. యూదుల ప్రార్ధన సాధారణంగా భగవత్ స్తుతితోను, ప్రార్థనకారుని అయోగ్యతా వర్ణనతోను ప్రారంభమౌతుంది. చాల కీర్తనల్లో ఈ పద్ధతి గోచరిస్తుంది. కాని ఈ పరిసయుడు మాత్రం దేవుని స్తుతించడు. తన అపవిత్రతను వ్యక్తం జేసికోడు గూడ. పైపెచ్చు తాను నీతిమంతుణ్ణని చెప్పకొన్నాడు. అన్యప్రజలు ఆసబోతులూ మోసగాళ్ళూ వ్యభిచారులూను. ఆ ప్రక్కనున్న సుంకరే ఇందుకు ఉదాహరణం, తాను మాత్రం పుణ్యశీలుడు! ఇక్కడ ఓ విశేషం గమనించాలి. ఇతడు తన తప్పిదాన్ని వెల్లడి జేయడు. అసలు తాను తప్పజేసినట్లే తోచలేదతనికి. అతడు భగవంతుణ్ణి మన్నింపు అడుగుకొననేలేదు గనుక, భగవంతుడుగూడ అతడ్డి మన్నించనేలేదు.

పరిసయుడు తాను సల్పే నీతికార్యాలను రెండిటిని పేర్కొన్నాడు. 1. యూదుల నిబంధనం ప్రకారం ఏడాది కొక తూరి మాత్రమే ఉపవాసముండాలి. అది కిప్పూర్ అనే ప్రాయశ్చిత్తదినాన, మరి యితడో వారానికి రెండుసారులు, సోమ గురువారాలు తనకైతానే ఉపవాస మండేవాడు. ఎందుకు? దుర్మార్ణులైన సుంకరుల పాపాలకు పరిహారం చేయడం కోసం. 2. అంగడిలో అమ్మేభోజన పదార్థాలకు వాటిని పండించిన సేద్యగాళ్ళే దేవాలయపు పన్ను చెల్లించాలి. కాని యితడు తానుగొన్న కాయగూరలన్నిటికీ స్వయంగానే