పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నవాడు తండ్రి యింట సేవకుళ్ళాగాక, గౌరవమర్యాదలతో స్వీకరింపబడ్డాడు. ఇకమీదట అతని నడవడికలో గూడ క్రొత్తదనం గోచరిస్తుంది. 2) జోళ్ళు ఉంగరమూ అధికారాన్నీ స్వాతంత్ర్యాన్నీ సూచిస్తాయి. అనగా చిన్న కుమారుడు ఇక మీదట అన్య యజమానులకు బానిసగాడు. తండ్రి యింట అతనికి అన్ని అధికారాలూ లభించాయి. ఐగుప్తున ఫరో ప్రభువు అధికారిగా నియమింపబడిన యోసేపునకు శాలువా ఉంగరమూ బంగారు గొలుసూ బహూకరింపబడ్డాయని చదువుతున్నాం - ఆది 41, 42, 3) బలిసిన దూడనుగోసి మాంసం వండించడం గూడ రోజురోజు జరిగే పనిగాదు. పాలస్తీనాలో ఎవరో గొప్ప అతిథులు వచ్చినపుడుగాని మాంసపు విందులు జరుగవు. కనుక ఈ విందు తండ్రికి చిన్నవానిపట్ల గల ఆదరాన్ని సూచిస్తుంది. ఈ మూడు కార్యాలద్వారా తండ్రి తన దుడుకు బిడ్డను పూర్తిగా క్షమించాడని అర్థంజేసికోవాలి. ఇంతటితో ఈ సామెత ముగియవలసింది. కాని ముగియలేదు. ఇంకా పెద్దకుమారుని కథ గూడ వుంది. అది చిన్నకుమారుని కథకంటెగూడ ముఖ్యమైనది.

పెద్దకొడుకు తండ్రి మాట జవదాటనివాడు. అతడు పొలం పనినుండి మరలివచ్చేటప్పటికల్లా ఇంటిలో విందులూ ఆటపాటలూను. ఇదేమిటా అని దిగ్ర్భాంతి జెందాడతడు. సేవకులు తమ్ముని రాకను తండ్రి ఉత్సాహాన్ని వివరించి చెప్పగా విని కోపావేశుడయ్యాడు. ఇంటిలోనికి అడుగుపెట్టక వెలుపలనే వుండి తన అసమ్మతిని వెలిబుచ్చాడు. తండ్రి తన్ను పిలువవచ్చి బతిమాలినా విన్పించుకోలేదు. “నేనిన్నాళ్ళబట్టి నీవు గీసిన గిరి దాటకుండా ఈ యింటిలో ఓ బానిసలా పనిజేస్తున్నాను. ఐనా నా మిత్రులతో విందారగించడానికై ఏనాడైనా ఓ చిన్న మేక కూననైనా యిచ్చి యొరుగుదువా? మరి ఇప్పడు నీ యీ కొడుకు తన ఆస్తినంతా ఉంపుడుగత్తెల వాతగొట్టి ఈలా వచ్చాడో లేదో, గబగబ క్రొవ్విన దూడను గోయించి మాంసం వండించి విందు జేయిస్తావా? అని బగబగ మండిపోయాడు. కాని తండ్రి ఆ కుమారుణ్ణి సముదాయిస్తూ నాయనా! నీవు నిత్యం నాతో వుండేవాడివే గదా! నావన్నీ నీవే. మరి నీ యీ తమ్ముడో అంటే చచ్చి బ్రతికాడు. ఈ మంచి రోజున మనం పండుగ జేసికోవద్దా? అని మృదువుగా మందలించాడు. ఇక్కడ ఈ తండ్రీ కొడుకుల సంభాషణంలో ఒక్క విషయం గమనించాలి. పెద్దకొడుకు కోపావేశుడై చిన్నవాణ్ణి "తమ్ముడు" అని పిలువడు. మరి “నీ కుమారుడు" అంటాడు. కాని తండ్రి అతని వాగ్లోరణిని సవరిస్తూ "నీ తమ్ముడు" అని సవరిస్తాడు.

ఈ సామెతమీద ఇన్ని పుటల వివరణం జూచాం. కాని దీనిలో ప్రధాన భావం ఏమిటి? ఈ సామెతలోని తండ్రి పరలోకపు తండ్రిని సూచిస్తాడు. పెద్దకుమారుడు పరిసయులనూ చిన్న కుమారుడు పాపాత్ములనబడు సుంకరులనూ సూచిస్తారు. తండ్రి తప్పిపోయిన కుమారుని పట్లలాగ, పరలోకపు తండ్రి పాపాత్ములపట్ల కనికరమూ జాలీ జూపుతాడు. కావున ఆయన్నలాగా ఈ పరిసయులునూ సుంకరులనబడే ఈ తప్పడు