పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. జారిపోయిన నాణెం - లూకా 15, 8 -10

1. వివరణం

ఈ సామెత లూకా సువిశేషంలో మాత్రమే కన్పిస్తుంది. దీని సందర్భంగూడ మొదటి సామెతో సందర్భం లాంటిదే. ఓ ఆవిడకు పది నాణాలున్నాయి. యూద స్త్రీలకు పెండ్లి అయ్యేపుడు పుట్టింటివాళ్లు కొన్ని బంగారు లేక వెండి నాణాలు కానుకగా యిస్తారు. ధనవంతులైతే నూరునాణాల దాకా, పేదలైతే పది నాణాలదాకా యిస్తారు. స్త్రీలు ఈ కానుకలను పైట చెంగున గట్టుకొని ఆ చెంగును అలంకరణ కోసం తలమీద కప్పకొనేవాళ్ళ రాత్రి నిద్రించేప్పడు గూడ ఆ చెంగును తొలగించేవాళ్లుకాదు. ఈ సామెతలో పేర్కొనబడిన పేదరాలు. ఆమెకు పుట్టింటివాళ్ళు ఇచ్చింది పది నాణాలే. ఐనా ఆమె వాటిని ప్రాణప్రదంగా చూచుకొంటూంది. ఓ దినం చెంగుముడి వదులై వాటిల్లో వొకటి జారిపోయింది. వెంటనే ఆమె దీపం వెలిగించి ఇల్లంతా గాలించింది. ఇక్కడ దీపం వెలిగించింది రాతైగాదు. పాలస్తీనా యిండ్లకు చిన్న తలుపులూ చిన్న కిటికీలు వుంటాయి. కనుక వెలుతురు లోపలకు ప్రవేశించేదిగాదు. అంచేత కాసుల్లాంటి చిన్న వస్తువులను చూడాలంటే పట్టపగలుగూడ దీపం వెలిగించవలసిందే. కనుక ఆమె దీపం వెలిగించింది. ఇల్లంతా ఊడ్చింది. ఊడ్వడం దేనికంటే నాణెం ఇంటి నేలలో పాతుకొనివున్న చిన్నచిన్న రాళ్ళకు దగిలి టంగున మోగుతుంది. అప్పడు దాన్ని గుర్తుపట్టవచ్చు. అలా ఆమె ఇల్లపూడ్చి నాణాన్ని గుర్తుపట్టి సంతోషంతో ఇరుగుపొరుగు అమ్మలక్కలను చేరబిలచి "నేను పోగొట్టుకొన్న నాణెం దొరికింది, మీరూ నాతోపాటు సంతోషించండి" అంది. ఈ “సంతోషం" అనేది ఈ సామెతలో ముఖ్యాంశం, కాపరి గొర్రె దొరికినందున సంతోషిస్తాడు. పేదరాలు నాణెం దొరికినందున సంతోషిస్తుంది. ఆలాగే ఒక్క పాపాత్ముడు పరివర్తనం జెందినపుడు దేవుడు సంతోషిస్తాడు. (ఈ సామెతలో దేవదూతలంటే దేవుడే యూదులు దేవుని పేరు ఉచ్చరించడానికి ధైర్యం చాలక దేవదూతలు అని వుచ్చరించేవాళ్లు.)

ఆ తప్పిపోయిన గొర్రెలాగే ఈ జారిపోయిన నాణెం గూడ పాపాత్ములకు పోలికగా వుంటుంది. ఈ పాపాత్ములు పశ్చాత్తాపపడ్డంవల్ల ప్రభువు ఆనందిస్తాడు. ఎందుకంటే అతడు పాపుల నాశంగాక, వాళ్ళ పరివర్తనం కోరుకొనే కరుణామయుడు. పాపులను క్షమించడమంటే అతనికి పరమానందం. ఇక క్రీస్తు పరలోకంలోని తండ్రి పంపగా వచ్చినవాడు. ఆ తండ్రిలాగే ఇతడుగూడ దయాపరుడు. పాపాత్ముల వర్గానికి చెందిన సుంకరులు మొదలైనవాళ్ళను దారికి తీసుకొనిరావడం అతని బాధ్యత. దీనికోసమే తండ్రి అతన్ని అధికారపూర్వకంగా పంపాడు. పరిసయులూ ధర్మశాస్త్ర బోధకులూ ఈ సత్యాన్ని గుర్తించాలి. ఇది సామెత భావం.