పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరలోకపిత ఈ కాపరిని బోలినవాడు. అతడు పాపాత్ముల పట్ల ఎంతో ఓర్పు జూపుతాడు. వాళ్ళ వినాశాన్ని గాక పరివర్తనాన్ని ఆశించే దయార్ద్ర హృదయుడు. ఇక క్రీస్తు అంటే ఆ తండ్రి పంపగా వచ్చిన మెస్సీయా, నీతిమంతుల కోసంగాక పాపాత్ముల కోసం విచ్చేసిన వైద్యుడు - మార్కు 2, 17. కావననే తాను పాపాత్ములతో కలసి తిరుగుతున్నాడు. వాళ్ళతో భుజిస్తూన్నాడు. వాళ్ళను మళ్ళా త్రోవకు మరల్చుతున్నాడు. కరుణామయుడైన ఆ కాపరిని బోలినవాడు పరలోకపు తండ్రి. ఆ తండ్రిని తనయందూ తన చర్యలందూ ప్రతిబింబించుకొంటున్నవాడు క్రీస్తు, ఈ క్రీస్తునిజూచి పరిసయులూ ధర్మశాస్తోపదేశకులూ గొణుగుకోగూడదు. ఈ నాయకులు పాపాత్ములపట్ల జూపే క్రూర స్వభావాన్ని మార్చుకొని, వాళ్ళ బలహీనతలను సానుభూతితో అర్థం జేసికోవాలి. ఇది యీ సామెతలోని ప్రధాన భావం.

కడన ఓ చిన్న విషయం. లూకా 15, 7కి మారుగా మత్తయి 18, 14లో "ఈ పసివారిలో ఒకడైన నాశమైపోవడం పరలోకంలోని మీ పిత చిత్తంగాదు" అని వుంది. అనగా ఈ సామెతకు లూకా జూపిన పర్యవసానం వేరు. మత్తయి చూపిన పర్యవసానం వేరు. లూకా పాపాత్ములు నిరుత్సాహపడనక్కరలేదనీ ప్రభువు వాళ్ళను ఆదిరిస్తాడనీ బోధించాడు. కాని మత్తయి శ్రీసభలోని క్రైస్తవ నాయకులు పాపాత్ములను వెదకి మళ్ళా దారికి దీసికొని రావాలని బోధించాడు. క్రీస్తు చెప్పిన సామెతలు సువిశేషకారుల రచనల్లో కెక్కేటప్పటికల్లా కొద్దిగా మార్పు జెందాయి.

3. అన్వయం

1.క్రీస్తు సామెతల్లో యిది చాల సుప్రసిద్ధమైంది. తొలి శతాబ్దిలోని క్రైస్తవులు నిర్మించిన రోమాపురి సారంగాల్లో మంచి కాపరి చిత్రాలు నూరింటికిపైగా కన్పించాయి. అనగా తొలి శతాబ్దికే యిది చాల ప్రసిద్ధిలోకి వచ్చిందనుకోవాలి. అంతియోకయ ఇన్యాసివారు, హెర్మసు మొదలైన ప్రాచీన క్రైస్తవ రచయితలు గూడ క్రీస్తుని మంచి కాపరిగా వర్ణించారు. ఒకోమారు మనం మనపాపాలను ఇక జయించలేము గాబోలు అని విచారిస్తూంటాం. అలాంటప్పుడు ఈ సామెత క్రీస్తు కారుణ్యాన్ని జ్ఞాప్తికిదెచ్చి మనకు మళ్ళా ధైర్యం కలిగిస్తుంది. ఆ ప్రభువు కారుణ్య హృదయాన్ని మననం చేసికోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. పాపోచ్చారణకు తయారయ్యేపుడుగూడ ఈ సామెతను ధ్యానించుకోవచ్చు.

2. నాల్గవ శతాబ్దంలో మిలాను నగరంలో భక్తుడు ఆంబ్రోసు ఈ సామెతమీద ఒక ఉపన్యాస మిచ్చాడు. అతని భావాల ప్రకారం క్రీస్తు మన మంచి కాపరి. మనమంతా పాపపు పొదల్లో జిక్కి దిక్కుమాలి వుండగా ఆ కాపరి జాలితో మనలను వెదకుకుంటూ " వచ్చాడు. అతడు సిలువమీద తాను చాచిన భుజాలమీదికి మనలను ఎక్కించుకొన్నాడు. మనకు పాప విముక్తి కలిగించాడు. ఆ నెనరుగల కాపరికి మనం చేయెత్తి మొక్కాలి.