పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. క్రీస్తుసామెతలు

మనవిమాట

ఈ పుస్తకాన్ని ఇంతకుముందే బైబులు భాష్యం 27,31, 33 సంచికల్లో ప్రచురించాం. క్రీస్తు చెప్పిన పెద్ద సామెతలు ఇంచుమించు 45 దాకా ఉన్నాయి. ఇవికాక చిన్న సామెతలు లేక ఉపమాన వాక్యాలు ఎన్నోఉన్నాయి. ఇవన్నీ కలిసి తొలి మూడు సువిశేషాల్లో చాల భాగం ఆక్రమించుకొంటాయి, బైబులు విద్వాంసులు సామెతలను చాల వర్గాలుగా విభజించారు. ప్రస్తుత పుస్తకంలో యెన్మిది రకాల సామెతల మీద సంగ్రహమై వ్యాఖ్య చెప్పాం. సామాన్య ప్రజలను మనసులో పెట్టుకొని ఈ వివరణను సులభపద్ధతిలో రచించాం.

బైబులు సామెతలు మన ప్రజలందరికీ తెలిసినవే ఐనా, వాటి అర్థం మాత్రం చాలమందికి తెలియదు. అందుచేత వాటికి వ్యాఖ్య అవసరం. సామెతల్లోని ప్రధానాంశం పోలిక లేక ఉపమానం. శ్రోతల మనసును ఆకట్టుకొనేది ఈ పోలికే ఇవి పిట్టకథల్లాగ ఉంటాయి. కథల్లాగ వుంటాయి కనుకనే వీటిద్వారా సామాన్య ప్రజలకూ పిల్లలకూ గూడ క్రీస్తు బోధలను సులభంగా వివరించి చెప్పవచ్చు. కాని ఈ సామెతలను మన బోధల్లో వాడుకోవాలంటే మన తరపున మనం వీటి భావాన్ని చక్కగా గ్రహించి ఉండాలి. అందుకోసమే ఈ వ్యాఖ్య కొబ్బెరకాయను పగులగొడితేనేగాని కొబ్బెర రాదు. శ్రద్ధతో చదువుకొంటేనేగాని సామెతల్లో దాగివున్న భావం అర్థంకాదు. కాని ఓమారు వీని సందేశాన్ని జాగ్రత్తగా గుర్తించామో, ఇక యివి మన సొంత ప్రార్ధనకుగాని ఇతరులకు బోధించడానికిగాని చక్కగా ఉపయోగపడతాయి. క్రీస్తు రెండువేల యేండ్లనాడు చెప్పిన ఈ చిన్న కథలు నేటికీ వినాలి అనే కుతూహలాన్ని పుట్టిస్తున్నాయి. ఆ ప్రభువు బోధల్లో మనకు విశేషంగా జ్ఞప్తికి వచ్చేవీ,కళాత్మకంగా మన హృదయానికి హత్తుకొనేవీ, ఈ సామెతలేనేమో! ఇది ఆరవ ముద్రణం.

విషయసూచిక

1. కారుణ్యపు సామెతలు 152
2. శిష్యధర్మాలను గూర్చిన సామెతలు 171
3. దైవరాజ్యపు సామెతలు 183
4. త్వరపడాలి అనే సామెతలు 189
5. వేచివుండాలి అనే సామెతలు 204
6. మెస్సియాను గూర్చిన సామెతలు 212
7.నటనాత్మకమైన సామెతలు 217
8. క్రీస్తు శ్రమలను గూర్చిన సామెతలు 218
- ప్రశ్నలు