పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కట్నమిస్తేనేగాని అమ్మాయిని పెళ్లిజేసికోరు. వ్యక్తులను బట్టిగాక కట్నాన్నిబట్టి వాళ్ళకు విలువ కడతారు. స్త్రీలను పర్ణాలతో కప్పివేస్తారు. భర్తల్లో భార్యలను పీడించేవాళ్ళూ తిట్టికొట్టేవాళ్ళూ కడకు చంపివేసేవాళ్ళూ అరేదేమీకాదు. మహిళలు కేవలం వంటింట్లో పనిచేసే దాసీలనీ, బిడ్డలను కనే యంత్రాలనీ చాలమంది మగవాళ్ళ భావన. ఆయా రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేసినా స్త్రీలకు వేతనం తక్కువ. స్త్రీలను ఎగతాళి చేసి యేడ్చిస్తారు. మానభంగం చేస్తారు. వేశ్యావాటికల్లో అమ్మివేస్తారు. సినిమాలు ప్రకటనలు మొదలైన సమాచార సాధనాల్లో వారిని అసభ్యంగా చూపిస్తారు. స్త్రీ శరీరాన్ని నగ్నంగా చూపించి సొమ్మ జేసికొంటారు. ఈ యానాచారాలన్నిటిలోను మగవాడెక్కువ, స్త్రీ తక్కువ అనే భావన వుంది. పురుషులు స్త్రీలను బానిసలనుగా జేసి తమ స్వార్ణానికి వాడుకోవచ్చుననే ఆలోచన వుంది. వాళ్ళమీద అధికారం నెరపి వాళ్ళను తమ యేలుబడిలో వుంచుకోవచ్చు అనే తలంపు వుంది. ఈలాంటి భావాలు క్రీస్తు మనసుకి వ్యతిరేకం.

ఆ మాటకొస్తే మన క్రైస్తవ సమాజంలోను శ్రీసభలోనుగూడ స్త్రీలకు సముచిత స్థానం లేదు. వాళ్ళను ఏదోవిధంగా అణచివుంచాలనే మన కోరిక. మనం వాళ్ళను సంప్రతించకుండానే నిర్ణయాలు చేస్తాం. ఒకోసారి స్త్రీల సొంత సమస్యలను గూర్చీ జీవితాలను గూర్చీకూడ పురుషులే నిర్ణయాలు చేస్తారు. వాళ్ళను దేవుని రూపం ధరించిన వ్యక్తులనుగా పరిగణించరు. ఏవో వస్తువుల క్రింద లెక్కకడతారు.

మన విచారణల్లో సిస్టర్ల బోలెడంత సేవ చేస్తారు. తరచుగా దేవాలయంలోని పనులన్నీ వాళ్లే చేస్తారు. కాని విచారణను నడిపించడంలో మాత్రం మన గురువులు సిస్టర్లను సంప్రతించరు. వాళ్ళతో కలసి నిర్ణయాలు చేయరు. ఇది మంచిపద్ధతి కాదు.

తిరుసభ తన సేవా కార్యక్రమాల్లో పురుషులనేగాక స్త్రీలనుగూడ అధికంగా వినియోగించుకోవాలి. వాళ్లకు ఉన్నత పదవులనూ బాధ్యతలనూ ఒప్పజెప్పాలి. వారిచేత గూడ వేదబోధ చేయించాలి. తిరుసభ తన అవివేకంవల్ల 19వ శతాబ్దంలో శ్రామిక వర్గాన్ని కోల్పోయింది. ఈ శతాబ్దంలోనే యువతను కోల్పోయింది. అనతికాలంలోనే స్త్రీలను గూడ కోల్పోయే ప్రమాదం వుంది.

మనం భగవంతుణ్ణి తండ్రిగాను, పురుషుణ్ణిగాను భావిస్తాం. అతన్ని తల్లినిగా స్త్రీనిగాగూడ భావించవచ్చు. దీనికి ఆధారాలు బైబుల్లోనే వున్నాయి.

క్రీస్తు ఈనాడు మన మధ్యలోకి వస్తే నేటి తిరుసభలో స్త్రీలకున్న స్థానాన్ని తప్పకుండా హెచ్చిస్తాడు. క్రిస్తవ సమాజంలో క్రీస్తు విలువను తప్పక పెంచుతాడు. ఈ యంశాన్ని మన వేదాంతులు కూడ అంగీకరిస్తారు. కనుక మనం స్త్రీలను అధికాదరంతో జూడాలి. ప్రపంచంలో జాతి వర్ణలింగభేదాలు సమసిపోతున్న ఈ శుభకాలంలో మనం విశాల హృదయంతో ప్రవర్తించి మహిళాభ్యుదయానికి చేయూత నివ్వాలి.