పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

{{{1}}}

15. యిప్రాయేలు ప్రజలు యావేకు వాడిన రెండవ ఉపమానం “వరుడు", యావే వరునిలాంటివాడు, యిప్రాయేలీయులు వధువులాంటివాళ్లు. జీవాత్మ పరమాత్మ వధూవరుల్లాంటివాళ్లనే భావం ప్రాచీన మతాలన్నిటిలోను కన్పిస్తుంది. మన దేశాన వైష్ణవ సంప్రదాయంలో ఈ భావం ప్రచురంగా కన్పిస్తుంది. దీన్నే హిందూ సాధకులు "మధురభక్తి" అంటారు. సీనాయి నిబంధనం ద్వారా యిస్రాయేలుప్రజలు యావే వధువు అయ్యారు. "ఎడారిలో నన్ను వెంబడిస్తూ ఆ యావనదశలో నీవు నాపట్ల జూపిన అనురాగాన్ని వైవాహిక ప్రేమను జ్ఞాపకం జేసికుంటాను" అంటాడు ప్రభువు యిర్మీయా ప్రవచనంలో -2,2. ఇక్కడ యిప్రాయేలు ప్రజ ఓ వధువుగా భావింపబడింది. ఈ వధువు ఈజిప్టునుండి బయలుదేరి వచ్చింది. ఎడారిలో యావేను వెంబడించింది. అప్పుడు వధువు యావనదశలో వుంది. ఎడారికాలంలో యిస్రాయేలుప్రజలు ఓ జాతిగా యేర్పడుతువచ్చారు. యావే ప్రజగా రూపొందారు. అందుకే ప్రభువు యావనదశను పేర్కొంది. వధువు ఎడారిలో చూపిన అనురాగం వైవాహిక ప్రేమ అని చెప్పబడింది. ఎన్నికద్వారా ఆ ప్రజలు యావే ప్రజలయ్యారు. యావే వధువుగా రూపొందారు. యావేకు ఉద్వాహమయ్యారు. ఆ వధువు కన్యవధువు. యావేను గాఢంగా ప్రేమించింది. అనగా తొలిరోజుల్లో ఆ ప్రజలు ప్రభువుపట్ల గాధానురక్తిని చూపారని భావం. ఇది యావే - యిప్రాయేలు దాంపత్య గాథలో తొలిదశ.

16 హో షేయా ప్రవక్త యూవేకు యిస్రాయేలీయులకు దాంపత్య సంబంధమున్నదని తన జీవితం ద్వారానే బోధించాడు. ఈ ప్రవక్త ఓ యువతిని పెండ్లి చేసికొని ఆమెను మనసార ప్రేమించాడు. కాని ఆ యువతి ప్రవక్తను విడనాడి, దేవదాసి ఐపోయింది. ఐనా ప్రవక్త ఆమెను క్షమించాడు. మల్లా ఆమెను తీసికొని వచ్చి అనురాగంతో జూచుకున్నాడు. ఇది అతని జీవితంలోని ఓ సంఘటన. ప్రభువు హో షేయాను ఈ సంఘటాన్ని ఆధారంగా తీసికొని ప్రవచనం చెప్పమన్నాడు. కనుక హోషేయా యిప్రాయేలు ప్రజలను కులటతో ఉపమించాడు. యావే నిబంధనం చేసికొనిన ప్రజ, అతడు ప్రేమించిన వధువు యిస్రాయేలు. ఐనా యీ యిస్రాయేలు ప్రభువునకు కట్టువడి యుండక బాలు మొదలైన అన్యదైవాలను ఆరాధించడం మొదలెట్టారు. ఏకైక భగవంతుడైన యావేను గాక అన్యదైవాలను ఆరాధించడాన్ని బైబులు "వ్యభిచారం" అని పిలుస్తుంది. ఈలా తన్ను విడనాడి అన్యదైవాల వద్దకు వెళ్లి వ్యభిచరించినా ప్రభువు ఆ ప్రజలను క్షమించాడు. కులటయైన భార్యను లాగా వాళ్లను మల్లా తన వద్దకు చేరబిల్చుకున్నాడు. తన ఆరాధకులనుగా జేసికున్నాడు. అతని కరుణయే యిందుకు కారణం.