పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుంటారు. వాళ్లపట్ల మొరటుగా ప్రవర్తించి వుంటారు. ఐనా ఈ పుణ్యాంగనలు ఏమీ వెనుకాడలేదు. ప్రభువు చనిపోయే వరకు అతనికి సానుభూతి చూపుతూ, అతనికి అండగా దగ్గరే నిలుచున్నారు. చివరి గడియ వరకు అతనికి తమ ప్రేమనూ కృతజ్ఞతను తెలియజేసారు - యోహా 19, 25.

మరియ మగ్డలీన ఆదరమూ భక్తి తక్కువేమికాదు. ఆమె క్రీస్తుకోసం తోటలో సమాధివద్ద గాలించింది. అతని శరీరం కన్పిస్తే ఎత్తుకొని పోవాలనుకొంది. ఆ కోరిక ఆమె గాఢభక్తికి నిదర్శనం. ఉత్థాన క్రీస్తు ఆమెను మరియా అని పేరెత్తి పిల్చాడు. ఆమె వెంటనే భక్తిభావంతో అతని పాదాలకు పెనవేసుకొంది - యోహా 19, 11-17.

4. క్రీస్తు శిష్యురాళ్లకు బోధ చేయడం

1. పశ్చాత్తాప బోధలు

ప్రభువు నానా రూపాల్లో శిష్యురాళ్లకు బోధ చేసాడు. వ్యభిచారిణియైన మరియ అతని బోధ వింది. 'దైవరాజ్యం సమీపించింది. హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించండి. తండ్రి ప్రేమను, దయను అర్థం చేసికొనండి. మీ పాపాలకు పశ్చాత్తాపపడి రక్షణ పొందండి". ఈ బోధవల్ల ఆమె పరివర్తనం చెందింది. క్రీస్తుపట్ల కృతజ్ఞత భక్తిభావం పెంపొందించుకొంది. అతడు సీమోను ఇంటిలో వుండగా అతని దర్శనం కొరకు వచ్చింది. ఆమె పాపపరిహారాన్ని పొందడానికి రాలేదు. ఆ కార్యం అంతకు ముందే జరిగింది, ప్రభువుకి కృతజ్ఞత తెలుపుకోవడానికి వచ్చింది. క్రీస్తు బోధ ఆమె పరివర్తనకు కారణం. ఆమె పాపాల ఫరోరత్వాన్నీ తండ్రి కరుణనీ, పశ్చాత్తాప మార్గాన్నీ ఆమెకు తెలియజేసింది ప్రభువు. హృదయశుద్ధిని పొంది దేవుణ్ణి ప్రేమించమని హెచ్చరించింది అతడే.

క్రీస్తు తనకు ఆతిథ్యమిచ్చే సీమోనుకి ఇద్దరు బాకీదారుల కథ చెప్పాడు. ఓ యజమానునికి ఇద్దరు బాకీదారులున్నారు. ఒకడు ఎక్కువగా బాకీపడి వున్నాడు, ఇంకొకడు తక్కువగా బాకీపడి వున్నాడు. యజమానుడు వీరిద్దరినీ క్షమించాడు. అప్పడు ఆ యిద్దరిలో యజమానుణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఎక్కువ సొమ్ము క్షమింపబడిన వాడేకదా? ఇది కథ, ఇక దీని భావమేమిటి?

ఈ కథలో ఎక్కువ సొమ్ముక్షమింపబడిన బాకీదారుడు మరియే. తక్కువ సొమ్మ క్షమింపబడిన బాకీదారుడు సీమోనే. మరియు ఎక్కువగా పాపాలు చేసింది. ఆమె పశ్చాత్తాపాన్ని జూచి తండ్రి ఆమెను ఎక్కువగానే మన్నించాడు. ఆమెకూడ కృతజ్ఞతా పూర్వకంగా దేవుణ్ణి ఎక్కువగానే ప్రేమించింది. కాని సీమోను తక్కువగా మన్నింప