పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనే రబ్బయి తాను స్త్రీగా పట్టనందుకూ, అన్యజాతుల్లో పట్టనందుకూ, ధర్మశాస్త్రం తెలియని సుంకరుల్లో పుట్టనందుకూ రోజూ దేవునికి వందనాలు అర్పించాడు. ఇతడు ఆనాటి చాలమంది యూద పురుషుల భావాలకు అద్దంపడతాడు. ఈలాంటి పరిస్థితుల్లో క్రీస్తు స్త్రీలపట్ల ఎంతో కరుణాపూరితంగా మెలిగాడు.

2. క్రీస్తు స్త్రీల కిచ్చిన విలువ

ప్రభువు ఆనాటి పరిసయులతోను సదూకయులతోను స్త్రీల హక్కులనుగూర్చి వాదించాడు. ఒకసారి అతడు ఆదికాండంలో స్త్రీ పుట్టువును తెలియజేసే వేదవాక్యాలను ఉదాహరించాడు. “దేవుడు మానవజాతిని సృజించాడు. తన్ను పోలునట్లుగా మానవుని చేసాడు. స్త్రీ పురుషులనుగా మానవులను సృజించాడు” - 1,27. ఇక్కడ ఈ వేదవాక్యాల భావమేమిటంటే, స్త్రీ పురుషులు సరిసమానం. వాళ్ళిద్దరిలోను దేవుని పోలిక వుంది. స్త్రీ పురుషుని కొరకులేదు. పురుషుని తర్వాత పుట్టలేదు. పురుషుడు పుట్టినప్పడే తానూ పుట్టింది. కనుక వాళ్ళిద్దరికీ ఒకటే విలువ. ఒకటే స్వేచ్చ వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు సహకరిస్తూ పరస్పర ఐక్యభావంతోను ప్రేమ భావంతోను జీవించాలి. ఒకరి వలన ఒకరు పరిపూరులు కావాలి. ఆ ఇద్దరికీ ఆధారభూతుడూ, ఇద్దరి గమ్మం ఒక్కడే - భగవంతుడు, వాళ్ళల్లో లింగభేదంవున్నావాళ్ళిద్దరి స్వభావం వొకటే. విలువలోను, స్వేచ్చలోను ఇద్దరు సరిసమానులు. హీబ్రూ బైబులు ఆదామని ఈష్ ఆనీ ఏవను ఈషా అనీ పిలుస్తుంది. అనగా అతడు నరుడు, ఆమె నారి. ఈ సందర్భంలో క్రీస్తు స్త్రీపురుషుల సమానత్వాన్ని సమర్ధించినట్లుగానే మనం అర్థం చేసికోవాలి - మత్త 19, 1-5.

యూదుల భావం ప్రకారం స్త్రీకి వివాహం చేసికోవడం బిడ్డలను కనడం తప్పితే వేరే ధ్యేయం లేదు. క్రీస్తు ఈ భావాన్ని నిరసించాడు. పరలోక జీవితంలో పురుషునికీ స్త్రీకీ గూడ వివాహముండదు, అక్కడ దంపతులు బిడ్డలను కనరు అని చెప్పాడు. వివాహ వ్యవస్థ ఈ లోకానికి పరిమితం. పరలోకంలో దానికి విలువలేదు. కనుక వివాహిత కాకపోయినా స్త్రీకి విలువ వుంటుందని క్రీస్తు భావం, ఆమె తనంతట తాను విలువ కలది - మార్కు 12, 24-25. ఈ భావాలు నాటి యూదుల భావాలకు కేవలం భిన్నమైనవి.

క్రీస్తు ఏకపత్నీవ్రతాన్ని పాటించమని యూదులకు బోధించాడు. ఇది సృష్టికర్త ఆశయం. భార్యాభర్తలు వివాహంద్వారా ఒకరితో ఒకరు నిబంధనం చేసికొని పరస్పర ప్రేమభావంతోను, ఐక్యభావంతోను, సహకార భావంతోను జీవించాలి. వాళ్ళిద్దరూ కలసి ' ఏకవ్యక్తి కావాలి - ఆది 2, 24 మత్త 19,6. సృష్టికర్త నిర్ణయించిన వివాహబంధం ఇది. ఈ బంధాన్ని నరమాత్రు లెవరూ బ్రెంచివేయకూడదు. అనగా విడాకులు పనికిరావు.