పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

-10, 16. ఈ మందకు ప్రభువు నిత్యజీవం ప్రసాదిస్తాడు– 10,28. ఆదర్శప్రాయుడైన కాపరి అంటే యిూలాంటివాడు కదా!

12. క్రీస్తు కరుణామయుడైన కాపరి. పూర్వం గొర్రెల కాపరియైన హేబెలు ప్రాణాలర్పించాడు- ఆది 4,8. బాధామయుడైన సేవకుణ్ణి గొర్రెపిల్లలాగ వధ్యస్థానానికి నడిపించుకొనిపోయి వధించారు - యొష 53,7. మందకు మేలుచేయాలనే కోరికగల యోగ్యుడైన కాపరినిబట్టి రొమ్ము పొడిచారు - జెక12,10. వీళ్లంతా పూర్వవేదంలో క్రీస్తుకు సంకేతంగా వుండే సూచకవ్యక్తులు, కరుణామయులు. ఈ మహానుభావుల లక్షణాలన్నీ క్రీస్తునందు ఫలసిద్ధి నందాయి. కావుననే ప్రభువు "నేను గొర్రెలకోసం ప్రాణాలర్పిస్తాను" అన్నాడు- యోహా 10, 15. ఈలా స్వీయ మరణంద్వారా మనకు జీవాన్ని చేకూర్చిపెట్టిన త్యాగమూర్తి ప్రభువు. కావున అతనికి ప్రణమిల్లదాం.

13. ఈ క్రీస్తు కాపరి లక్షణాలు కూడ ఓ మారు స్మరించుకుందాం. 1) కాపరి గొర్రెలను మందకూరుస్తాడు. ఆలాగే క్రీస్తు కాపరి దేవుని ప్రజలను ఒక్క మందగా ఐక్యపరుస్తాడు - యోహా 10,16. 2) కాపరి గొర్రెలను లెక్కిడి చూస్తాడు. ఏవైనా తప్పిపోతే వెంటనే జాగ్రత్త పడతాడు. క్రీస్తుకూడ తప్పిపోయిన గొర్రెను వెదక్కుంటూ వెళాడు - లూకా 15,3-7. 3) కాపరి మందమీద జాలిచూపుతాడు, అవంటే అతనికి ప్రాణం. కాపరిలేని, మందలాగవున్న ప్రజలను చూచేప్పటికి క్రీస్తుకు కడుపు చెరుమోతుంది - మత్త 9, 36. 4) క్రీస్తు కాపరి చెడు గొర్రెలనుండి మంచి గొర్రెలను వేరుపరుస్తాడు. చెడ్డవానిని దండించి మంచివానిని సంభావిస్తాడు - మత్త 25, 32-46. 5) క్రీస్తు మేతకోసం గొర్రెలను పచ్చిక బయళ్ళకు తోలుకొనిపోతాడు. అక్కడ వన్యమృగాలనుండి వాటిని కాపాడతాడు. వాటికోసం ప్రాణాలుకూడ అర్పిస్తాడు - యోహా 10,4. ఇంతకన్నా కాపరి చేయగలిగిందేముంది?

14. తన గొర్రెలేవో ప్రభువునకు తెలుసు, వాటికి ప్రభువెవరో తెలుసు. అవి అతని స్వరాన్ని వింటాయి. అతన్ననుసరిస్తాయి - 10,27.3. క్రీస్తునకు మనలను గూర్చి తెలుసు. కాని మనకు క్రీస్తునుగూర్చి తెలుసా? అతని స్వరాన్ని మనం గుర్తుపట్టగలమా? భక్తురాలు మరియమద్దలీన అలా గుర్తుపట్టింది. క్రీస్తు “మరియూ” అని పిలువగానే ఆమె "ప్రభూ!” అంటూ అతని పాదాలమీద వ్రాలింది - యోహా 20,16. ఈలాగే మనమూ మన హృదయంలోనే ప్రభు స్వరాన్ని వినగలిగి వుండాలి. ప్రభువును అర్థంచేసికోగలిగి వండాలి. అనుభవ పూర్వకంగా, ప్రేమతో ప్రభువును గూర్చి తెలిసికొని వుండాలి. అలా తెలిసికొని, ఆ ప్రభువు ననుసరించి వెళ్తూండాలి.