పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రమే అనేవాళ్ళు చాలమంది వున్నారు. పైగా పైన మనం పేర్కొన్న హెలెన కథకు కనీసం మూడు రూపాంతరాలు కూడ వున్నాయి. ఇంకా, హెలెన కాక మరెవరో పవిత్ర సిలువను కనుగొన్నారని చెప్పే కథలు కూడ వున్నాయి.

2. సిలువ వాడకం

క్రైస్తవ సంకేతాలన్నిటిలోను మనం ఎక్కువగా వాడేది సిలువనే, ఐదవ శతాబ్దంలోనే సిరియా దేశంలో పూజనర్పించే పీఠంపై సిలువను పెట్టేవాళ్ళు. ఆరవ శతాబ్దంలో ప్రదక్షిణాల్లో సిలువను మోసికొనిపోవడం మొదలుపెట్టారు. 8వ శతాబ్దంలో షార్ల్మేన్రాజు పాపుగారికి ప్రదక్షిణ సిలువను బహూకరించాడు. ప్రదక్షిణం ముగిసాక దాన్ని పూజనర్పించే పీఠం దగ్గర పెట్టేవాళ్లు. మధ్యయుగాల్లో దేవాలయాల గోడలపై పండ్రెండు తావుల్లో సిలువ ఆకృతులు చెక్కేవాళ్ళు ఈ పండ్రెండు తావుల్లోను దేవళాలకు ప్రతిష్ఠ చేసేవాళ్లు. క్రమేణ దేవాలయాల మీదనేగాక ఇండ్లమీద, బళ్ళమీద ఇంకా రకరకాల కట్టడాల మీద సిలువ ఆకృతులు నిర్మించారు. సమాధుల దొడ్లలో సిలువలు నెలకొల్పారు. పూజ వస్తాలమీద వాటిని కుట్టించారు.

క్రమేణ పంట భూములను సిలువతో ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఆలాగే నూత్న భవనాలు, వాహనాలు పశువులు మొదలైనవాటిని గూడ ఆశీర్వదించారు. సిలువ ఆకృతులను గూడ సిలువ గుర్తుతో ఆశీర్వదించారు. భక్తిగలవాళ్లు తాము వాడుకొనే ప్రతిక్రొత్త వస్తువును మొదట ఆశీర్వదించిగాని వాడుకొనేవాళ్లు కాదు.

కోన్స్టంటయిను చక్రవర్తి ఆకాశంలో సిలువను దర్శించి యుద్ధంలో విజయాన్ని సాధించాడని చెప్పాం. అతని తర్వాత యుద్దాల్లో సిలువ ప్రచురమైన సంకేతమైంది. సైనికుల దుస్తుల మీద ఆయుధాలమీదా సిలువ గురుతులు వుండేవి. 11-13 శతాబ్దాల మధ్యకాలంలో క్రైస్తవులు మహమ్మదీయులతో చేసిన యుద్దాలకు "సిలువ యుద్దాలు" అని పేరు. ఐతే ఈ కాలంలో సిలువ క్రీస్తుశ్రమల చిహ్నంగా గాక విజయ చిహ్నంగా మారిపోయింది. క్రీస్తు తన సిలువ ద్వారా మరణాన్నీ పాపాన్నీ జయించినట్లే మనం కూడ సిలువ ద్వారా శత్రువులను జయిస్తామని క్ర్తెస్త్రవ ప్రభువులు భావించారు.

రానురాను సిలువభక్తి ఇంకా చాలా భక్తి మార్గాలకు దారితీసింది. పంచగాయాల భక్తి, తిరుహృదయ భక్తి, క్రీస్తు శ్రమలపట్ల భక్తి, తిరురక్తభక్తి, సిలువ మార్గం మొదలైన భక్తిమార్గాలన్నీసిలువ నుండి పుట్టినవే. మధ్యయుగాల్లో సిలువ ధ్యానాలు కూడ విరివిగా ప్రచారం లోకి వచ్చాయి. ఇగ్నేప్యసుగారి తపోభ్యాసాల్లో భక్తుడు సిలువపై వ్రేలాడే క్రీస్తుని