పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుగ్రహంతోనే యుద్ధంలో తన శత్రువుని జయించానని నమ్మాడు. అతడు తన డాళ్ళపై సిలువ ఆకారాన్ని గూడ చెక్కించాడు. ఈ చక్రవర్తి సిలువపై చనిపోయిన క్రీస్తుపట్ల గల గౌరవభావంచే, దోషులకు విధించే సిలువశిక్షను రద్దుచేసాడు. ఆనాటినుండి సిలువ బహిరంగంగా కన్పించడం మొదలుపెట్టింది.

ఉన్నట్లుండి దిడీలున ప్రజల్లో సిలువపట్ల గౌరవాదరాలు పెరిగాయి. దీనికి కారణమిది. 326లో కోన్స్టంటయిను తల్లీ భక్తురాలూ ఐన హెలెన యెరూషలేములో క్రీస్తు సిలువను కనుగొంది. అది పవిత్రమైన మృతావశేషం ఐంది. కనుక ఆ సిలువ కొయ్యముక్కలను భక్తి భావంతో ప్రపంచం నలుమూలలకూ పంపారు. భక్తులు వాటిని ఆరాధించడం మొదలుపెట్టారు. కనుక ఐదారు శతాబ్దాల్లో సిలువ విరివిగా ప్రచారంలోకి వచ్చింది. మధ్య యుగాలదాకా ఈ రీతిగానే జరిగింది. క్రమేణ బంగారు సిలువలు రత్నాలు పొదిగిన సిలువలు వాడుకలోకి వచ్చాయి. సిలువపట్ల తొలి శతాబ్దాల్లోలేని గౌరవమూ ఆదరణా ఇప్పుడు పట్టుకవచ్చాయి. సిలువను మోసే గొర్రెపిల్ల బొమ్మద్రాక్షతీగలు కలిగిన సిలువ బొమ్మ ఇంకా నానా ఆకారాల్లో కూడ సిలువలు వ్యాప్తిలోకి వచ్చాయి. సిలువ రక్షణ నిచ్చేదనీ, ఏదెను తోటలోని జీవవృక్షమనీ ఈ బొమ్మలు సూచించేవి. ఐర్లండులో దారిప్రక్కనగల పెద్ద బండలపై సిలువను చెక్కడం ప్రారంభించారు. మధ్యయుగాల్లో క్రీస్తు రూపంగల సిలువలు విరివిగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ కాలంలో ప్రజలకు క్రీస్తు శ్రమలపట్ల గాఢమైన భక్తి వుండేది. ఆ రోజుల్లో యుద్దాయుధాల మీద సిలువ ఆకృతి తప్పకుండా వుండేది.

ఇక్కడే హెలెన భక్తురాలు సిలువను కనుగొన్న ఉదంతాన్ని గూడ చెప్పాలి. నాల్గవ శతాబ్దంలో కోన్స్టంటయిను చక్రవర్తి క్రైస్తవ మతాన్నిస్వీకరించాడని చెప్పాంగదా! దానితో రోమను సామ్రాజ్యంలో క్రైస్తవులను హింసించడం మానివేసారు. ఈ చక్రవర్తి తల్లే పునీతురాలయిన హెలెన. ఈమె యెరూషలేములో యూదులనూ క్రైస్తవులనూ ప్రోగుజేయించి క్రీస్తు చనిపోయిన సిలువను వెదికించింది. కాని ఒకే స్థలంలో మూడు సిలువలు దొరికాయి. వానిలో ఒకటి క్రీస్తుదీ, మిగతావి రెండూదొంగలవీ అని నిర్ధారించారు. కాని వాటిల్లో క్రీస్తు సిలువ ఏదో గుర్తించడం ఏలా? దైవప్రేరణంపై ఆ సిలువలను ఒక మృత దేహానికి తాకించారు. ఏ సిలువవల్ల మృతుడు సజీవుడౌతాడో అది క్రీస్తు సిలువ అనుకొన్నారు. ఆ నిర్ణయం ప్రకారమే క్రీస్తు సిలువను గుర్తించారు. ఈలా గుర్తించడం 325 లో జరిగింది. తర్వాత ఈ సిలువ ముక్కలను ప్రపంచం నలుమూలలకు ఆరాధించడానికి పంపారు.

కాని నాల్గవ శతాబ్దంలోనే కొంతమంది ఇది వట్టి కట్టుకథ అని పేర్కొన్నారు. ఇప్పుడు అందరు చరిత్రకారులూ ఈ కథను నమ్మరు. ఇది భక్తిభావంతో కల్పించిన కథ