పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిలువవేయబడినవాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం చెపుతుంది - ద్వితీ 21,23. క్రీస్తు అలా శాపగ్రస్తుడు ఐనవాడు. ఆలాంటివాడు తమ్ము రక్షిస్తాడని యూదులు కలలో కూడ తలంచరు. ప్రభువు సిలువపై వ్రేలాడుతుండగా చూచినవాళ్ళు అతన్ని అపహసించారు. నీవే మెస్సీయావైతే సిలువమీది నుండి దిగిరమ్మన్నారు. పేత్రు మొదలైన శిష్యులు క్రీస్తు సిలువమరణాన్ని ఏ మాత్రం అంగీకరించలేదు. "అది నీకు దూరమగునుగాక అని పేత్రు పలికాడు - మత్త 16,22. అది నిందావమానాలను సూచిస్తుందని చెప్పాంగదా! ఈలా సిలువ మరణం గ్రీకురోమనులకూ, శిష్యులకూ, యూదులకూ ఎల్లరికీ అసహ్యకరమైంది. అలాంటి మరణం ద్వారా క్రీస్తు జనులను రక్షించడమేమిటి? ఐనా తండ్రి రక్షణ ప్రణాళికలోని గొప్పతనం ఇక్కడే వుంది.

2. తండ్రి నిర్ణయం, లేఖనాలు

క్రీస్తుకి సిలువ మరణం అవసరం. అది తండ్రి నిర్ణయించిన రక్షణ ప్రణాళిక, దానికి తిరుగులేదు. అందుకే క్రీస్తు అది అగత్యం అని పల్మాడు - మత్త 16,21. అగత్యం అంటే తప్పనిసరి అని అర్థం. కాని ఆ దశలో ఆ సంగతి శిష్యులకు అర్థం కాలేదు. క్రీస్తు వుత్తానమై ఆత్మదిగివచ్చాక మాత్రమే వారికి సిలువ రహస్యం బోధపడింది. తండ్రే దాన్ని నిర్ణయించాడని అప్పుడు శిష్యులు అర్థం చేసికొన్నారు. తర్వాత శిష్యులు కూడ తమ బోధల్లో దాని అవసరాన్ని పేర్కొన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన్ని గూర్చి వ్రాయబడినదంత నెరవేరిందని బోధించారు - అ,చ. 13,28. లేఖనాలు అతనియందు నెరవేరాయని ప్రకటించారు - యోహా 19,28. “క్రీస్తు శ్రమలు అనుభవించి మహిమలో ప్రవేశించడం అనివార్యం" అని వెల్లడిచేసారు - లూకా 24, 26. ఈ విధంగా క్రీస్తు సిలువను తండ్రి ముందుగానే నిర్ణయించాడు. పూర్వవేదం కూడ ఆ సంఘటనను ముందుగానే చాలసార్లు పేర్కొంది. అనగా సిలువ మరణం యాదృచ్ఛికమైంది కాదు. అది జరిగితీరాలి. అది లేకపోతే నరులకు రక్షణం లేదు.

3. సిలువద్వారా తండ్రి విజ్ఞానం వెల్లడియాతుంది

గ్రీకులు, రోమనులు సిలువ మరణం పిచ్చితనం, అవివేకం అని యెంచారు. కాని పౌలు సిలువ మరణం తండ్రి విజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది అని బోధించాడు. అతని భావాలను కొంచెం విపులంగా పరిశీలిద్దాం. క్రీస్తు మన పాపాల కొరకు మరణించాడు- 1 కొ 15,3. సిలువ వేయబడిన క్రీస్తుని మాత్రమే తెలిసికోవాలని పౌలు కోరిక -2,2. పూర్వవేదం పేర్కొన్నట్లుగా, సిలువలోనే తండ్రి రక్షణ ప్రణాళిక స్పష్టంగా వెల్లడియౌతుంది -1,19.దానిలోనే అతని బలం గోచరిస్తుంది -1,25.సిలువమీద