పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు అప్పటికే చనిపోయి వున్నాడు. కనుక వాళ్ళు అతని కాళ్లు విరుగగొట్టలేదు. ఒక సైనికుడు మాత్రం అతని ప్రక్కను ఈటెతో పొడిచాడు - యోహా 19, 31-34. ఆ పిమ్మట అరిమత్తయియా యోసేపు మొదలైనవాళ్ళు అతని శరీరాన్ని సిలువనుండి దించి గౌరవప్రదంగా పాతిపెట్టారు - మార్కు 15, 46. సువిశేషాల నుండి మనకు లభించే క్రీస్తుశ్రమల వివరాలు ఇవి. సువిశేష రచయితలు క్రీస్తు శారీరక బాధలను వర్ణించలేదు. అతన్ని కొరడాలతో కొట్టించారు, సిలువ వేసారు అని వట్టి పొడిమాటలు చెప్పి వూరకున్నారు. కాని యివి శ్రమలు.

3. సిలువ మరణంలోని ఆంతరార్థం

దైవశాస్త్రరీత్యాసిలువ మరణంలోని అంతరార్థం ఏమిటి? అతని సిలువ మరణం మనకు ఏమి సాధించి పెట్టింది? ఆ సంఘటనం ఈనాడు మన క్రైస్తవ జీవితాన్ని ఏలా ప్రభావితం చేస్తుంది? ప్రభువు సిలువ మరణం ఈనాడు మన జీవితంలో ఏలా కొనసాగిపోతుంది? ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి. సిలువ మనకు రక్షణ సాధనం. కనుక మనకు దానిపట్ల ఆరాధన భావముండాలి. క్రీస్తు మరణానికి ముందు అది అవమాన సూచకమైంది, అతని మరణం తర్వాత అది గౌరవప్రదమైంది ఐంది. అది మొదట క్రీస్తుకి మహిమను చేకూర్చి పెట్టింది. తర్వాత క్రైస్తవులమైన మనకు కూడ మహిమను సంపాదించి పెడుతుంది.

1. క్రీస్తు సిలువ

1. సిలువ ఆటంకాన్ని కలిగిచేంది

"మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. అతడు యూదులకు ఆటంకంగాను అన్యులకు అవివేకం గాను వున్నాడు" అని వ్రాసాడు పౌలు భక్తుడు - 1కొ 1,23. గ్రీకు రోమను ప్రజలకు సిలువ వేయబడినవాడు అవివేకిగా కన్పిస్తాడు అనగా వాళ్లు అలాంటివాణ్ణి గౌరవంతో చూడక చీదరించుకొంటారు. ఆలాంటివానినుండి తమకు రక్షణం లభిస్తుందని వాళ్ళు ఏమాత్రం నమ్మరు. రోమను సామ్రాజ్యంలో సిలువ మరణం బానిసలకు ఉద్దేశింపబడింది - ఫిలి -2,7. బానిస యజమానుని రక్షిస్తాడా? ఇంకా ఆ మరణం అవమానకరమైంది కూడ - హెబ్రే 12,2.

ఇక, సిలువ మరణం యూదులకు ఆటంకంగా వుండేది. వాళ్ళు మృతదేహం నుండి రక్షణం లభిస్తుందని ఎంతమాత్రం నమ్మరు. వాళ్ళ భావాల ప్రకారం మృతదేహాన్ని తాకనుగూడ తాకకూడదు. అలా తాకితే మైలపడతాం అనుకొనేవాళ్ళు. ఇంకా,