పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిలువ మరణం ద్వారా తనకు విధేయుడై నందుకు మెచ్చుకొని తండ్రి తన దివ్యనామాన్నే క్రీస్తుకిచ్చి సత్కరించాడు - ఫిలి 2.9. అదే ప్రభువు అనే బిరుదం.

ఈ క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది మన రక్షణాన్ని స్వీకరిస్తాం. ఇది తండ్రి చిత్తం. నేడు మనం ఈ తండ్రి నామాన్ని పవిత్రపరచాలి. కాని అందరినీ పవిత్రపరచే దేవుణ్ణి మనమేలా పవిత్ర పరుస్తాం? మనం జ్ఞానస్నానంలో పొందిన పావిత్ర్యాన్ని నిలబెట్టుకోవడం ద్వారానే. ఆ పావిత్ర్యాన్ని మనలో వదిలపరచమని మనం మాటిమాటికి దేవుణ్ణి అడుగుకోవాలి. మన పవిత్ర జీవితం ద్వారానే మనం దేవుని నామాన్ని పవిత్రపరుస్తాం. మనం నిర్మలంగా జీవించినపుడు దేవుని సామానికి కీర్తికలుగుతుంది. పాపజీవితం గడిపినపుడు నానా జాతులమధ్య అతనికి అపకీర్తి కలుగుతుంది - యెహే 36,21.

ఇక, దేవుని నామాన్ని మనం మాత్రమే పవిత్ర పరస్తే చాలదు. అన్యులు కూడ పవిత్ర పరచాలి. ఆలా జరగాలని మనం ఆశించాలి, ప్రార్థించాలి. నరులందరు తమ నిర్మల జీవితం ద్వారానే దేవుని పవిత్రనామాన్ని స్తుతించి కీర్తించాలి.

2.నీ రాజ్యం వచ్చునుగాక

ఇక్కడ "రాజ్యం" అనే మాటను "పరిపాలనం" అని కూడ అనువదించవచ్చు. అనగా మన హృదయంలో దేవుని పరిపాలనం నెలకొనాలని ఈ వాక్యం భావం. దేవుడు మన హృదయాలను పరిపాలించాలని ఫలితార్థం. దైవరాజ్యాన్ని (పరిపాలనను) మన దగ్గరికి తీసికొని వచ్చినవాడు క్రీస్తు. సువిశేషాల్లో అతడు ప్రధానంగా బోధించింది దీన్నే. అతని మరణొత్థానాలతో దైవరాజ్యం రానే వచ్చింది. అంత్య భోజనంతోనే ఈ రాజ్యం ఆవిర్భవించింది. నేడు దివ్యసత్రసాదం ద్వారా మన మధ్యలో నెలకొనివుంది. సిప్రియను భక్తుడు వాకొన్నట్లుగా అసలు క్రీస్తే దైవరాజ్యం. కనుక అతని రాకతోనే దైవరాజ్యం వచ్చిందనాలి. ఒకనాడు అతనితోపాటు మనం కూడ ఉత్థానమౌతాం. అతనితోపాటు మనం కూడ రాజ్యపాలనం చేస్తాం.

ఆత్మా వధువూ "యేసు ప్రభూ! రమ్ము" అని పల్కుతున్నారు - దర్శ 22,20. తిరుసభ ఆశతో ప్రభువు రాజ్యం కొరకు ఎదురుచూస్తుంది. టెర్టూలియను చెప్పినట్లుగా, వేదసాక్షులు "ప్రభూ! నీవు త్వరగా విజయం చేసి మా నెత్తుటిని చిందించిన వారిపై పగతీర్చుకో అని అరుస్తారు. కనుక ప్రభువు స్వయంగా నేర్పింపకున్నా ఈనాడు మనం నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించేవాళ్ళమే.