పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోహాను, మేమెవర్ని తాకి చూచామో, ఎవర్నికన్నులార దర్శించామో, ఎవరి వాక్యాలను చెవులార విన్నామో ఆ క్రీస్తునకు సాక్ష్యమిస్తున్నాము అన్నాడు – 1యేహా 1.1. క్రీస్తు మన పాపాలకు శాంతిచేసేవాడు అని నమ్మాడు -1యోహా 2,2. కొమ్మలు తల్లి తీగలోనికి లాగే మనమూ ఆ ప్రభువులోనికి ఐక్యమౌతామనీ, తల్లి తీగలోని సారం కొమ్మల్లోనికి ప్రసరించినట్లే క్రీస్తు వరప్రసాదమూ మనలోనికి ప్రసరిస్తుందనీ బోధించాడు -15, 4 ప్రభుని అతడు ఆకళింపునకు తెచ్చుకొన్న తీరు ఆలాంటిది.

ఓ మారు ప్రభువు మీరూ నన్ను విడిచి వెళ్లారా అని శిష్యులను ప్రశ్నించాడు. పేత్రు "ప్రభూ! మే మెక్కడికి వెళాం. నిత్యజీవమిచ్చే పలుకులు నీ నోటినుండి వెలువడుతున్నాయి" అని జవాబిచ్చాడు - యోహా 6,68. క్రీస్తుని ఎరుగనని బొంకిన పేత్రు ప్రభువు తనవైపు తేరి పారజూచేప్పటికల్లా గుండెగరగి బోరునయేడ్చాడు - లూకా 22,62, ఆ ప్రభువు పట్ల అతనికున్న అనుభవం ఆలాంటిది.

మరియ మగ్డలీన ఉత్తానక్రీస్తుని జూచి తోటమాలి అనుకొంది. నీవు క్రీస్తుని తీసికొనిపోయినట్లయితే అతన్నెక్కడ దాచి వుంచావో చెప్ప, నేనాయన్ను ఎత్తుకొనిపోతాను అంది - యోహా 20,15. అంతట ప్రభువు ఆమెను పేరెత్తి "మరియా" అని పిలువగానే మరియ భక్తిపారవశ్యంతో ప్రభుపాదాలపై వాలింది. ఈ విధంగా "నా గొర్రెలకు నా స్వరంతెలుసు" అన్న ప్రభువాక్యం ఆమె పట్ల సార్థకమయింది — యోహా 10, 4. ప్రభువు మీద ఆమెకున్న పరమానురక్తి ఆలాంటిది.

మరియొక మరియకూడ వుండేది. ఈమె ప్రభుపాదాల చెంత గూర్చుండి అతని వాక్యాలను భక్తిభావంతో ఆలిస్తూండేది. తన అక్కమార్త నిష్కరలాడినా ఆమె ప్రభుపాదాల చెంతనుండి లేవలేదు - లూకా 10,39. ప్రభువు మీద ఆమెకున్నప్రేమభావం ఆలాంటిది. ఈ యుదాహరణలను బట్టి బైబులు భక్తులకు భగవంతుని పట్ల వ్యక్తిగతమైన అనుభవముండేదని రూఢమౌతుందిగదా! ఈ యనుభవం లేందే ప్రార్ధనం లేదు. క్రైస్తవ జీవతమూ లేదు. క్రైస్తవమతమంటే నిర్జీవమైన కొన్నిసిద్ధాంతాలను అనుసరించడం గాదు. కొన్ని ఆచారాలను పాటించడంగాదు. మరి సజీవుడైన ఓ వ్యక్తిని అనుసరించడం. ఉత్తానక్రీస్తుని నాయకునిగా స్వీకరించడం. అతనితో పరిచయమూ అనుభవమూ పెంపొందించుకోవడం. కాని నేటి మన క్రైస్తవమతం అనుభవంలేని మతమైపోయింది. గ్రుడ్డితనంగా ఏవో కొన్ని ఆచారాలనూ, నియమాలనూ, కర్మ కాండలనూ పాటించే