పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందువలన మనతరపున మనమూ ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. ఓ యజమానుడు తన సేవకునికి పెద్ద అప్పను క్షమించాడు. కాని ఆ సేవకుడు తనకు బాకీపడివున్న మరోసేవకునికి చిన్న అప్పను క్షమించలేక పోయాడు. అతన్ని గూర్చి "నేను నీ పట్ల దయ జూపినట్లే నీవు నీ తోడిదాసునిపట్ల దయ జూపవలదా?" అనే వాక్యం విన్పిస్తుంది - మత్త 18, 33. పైగా మార్కు 11, 25లో "నీవు ప్రార్థనకు పూనుకొన్నప్పడు నీ సోదరుని పై నీకేమైన మనస్పర్ధ వున్నట్లయితే ముందుగా అతన్ని క్షమించు" అనే వాక్యం కన్పిస్తుంది. ఈ వాక్యాలనుబట్టి మనం సోదర ప్రజలను క్షమించడం ఎంత అవసరమో స్పష్టమౌతుందిగదా!

ఇంకో సంగతిగూడ. లూకా మత్తయి రచించిన పరలోక జపాలను గ్రీకుభాషలో చదివిచూస్తే ఓ సత్యం బోధపడుతుంది. లూకా రచించిన పరలోక జపంలో "మేము మా యోద్ద అప్పపడిన వారిని క్షమిస్తున్నాం గనుక నీవూ మా యప్పలను క్షమించు" అనివుంది - 11, 4. ఇక్కడ "కనుక" అనేమాట షరతును తెలుపుతుంది. అనగా "మేము మా సోదరులను క్షమిస్తేనే నీవు మమ్ము క్షమించు, లేకపోతే క్షమించవద్దు" అని భావం. మత్తయి రచించిన పరోకజపంలో "మా యొద్ద అప్పబడిన వారిని మేము క్షమించినట్లే నీవు మా యప్పలను క్షమించు" అని వుంది - 6,12. ఇక్కడ "అట్లే" అనే మాట పరిధిని తెలుపుతుంది. అనగా "మేము మా సోదరులను ఎంతవరకు క్షమిస్తున్నామో నీవు మమ్మ అంతవరకు క్షమించు" అని భావం. ఈ రీతిగా లూకా భావించినట్లు షరతును తీసికొన్నా, లేక మత్తయి భావించినట్లు పరిధిని తీసికొన్నా మనం తోడి ప్రజలను క్షమిస్తుండాలనే ఫలితార్థం. కనుక పరస్పర క్షమాపణమూ, భగవత్ క్షమాపణమూ ఈ యైదవ విన్నపంలోని అంశాలు.

7) మమ్మ శోధనలో చిక్కుకోనీయవద్దు

శోధనం రెండు విధాలుగా వుంటుంది. దేవుడు అబ్రాహాముని శోధించాడు - ఆది 22, 1. అనగా ఇక్కడ దేవుడు అబ్రాహాము తన ఏకైక కుమారుడైన ఈసాకును బలిగా సమర్పించాలని కోరాడు. మన విశ్వాసం ఏపాటిదో తెలిసికోవడం కోసం దేవుడు అప్పుడప్పుడూ ఈలాంటి పరీక్షలిస్తుంటాడు. ఈలాంటి శోధనలవలన పాపమేమి ఉండదు. ఇటువంటి సన్నివేశాలద్వారా మనలను పాపంలోనికి లాగాలని దేవుని ఉద్దేశమూగాదు.

ఇక, మరోరకమైన శోధనలు కూడ వున్నాయి. ఈ శోధనలు మనలను పాపంలోనికి కూలద్రోయడానికే వస్తాయి. ఇవి పిశాచం నుండైనావస్తాయి. లేదా మన పతన స్వభావంనుండైనా పడతాయి - యాకో 1,13-14. ఈలాంటి శోధనలు వచ్చినపుడు మనం వాటిని ప్రయత్నపూర్వకంగా ఎదిరించాలి. లేకపోతే పాపంలో పడిపోతాం.