పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. క్రీస్తు ప్రార్థనలోని రెండు ముఖ్యాంశాలు

యూదుల ప్రార్థనతో పోల్చిచూస్తే క్రీస్తు ప్రార్థనలో కనిపించే విశేషాలను కొన్నిటిని పైన పేర్కొన్నాం. కట్టకడన క్రీస్తు ప్రార్థనలో కనిపించే ముఖ్యాంశాలను రెండింటిని వివరించాలి. మొదటిది, క్రీస్తు పరలోకపితను అరమాయిక్ భాషలో "అబ్బా" అని సంబోధించేవాడు - మార్కు 14, 36. ఆ భాషలో ఈ శబ్దానికి “నాన్న" అని అర్థం. ఇది దేవునిపట్ల అతనికున్న చనువును సూచిస్తుంది. పూర్వవేదపు యూదులెవరూ పరలోకపితను వ్యక్తిగతంగా నాన్న అని పిలువలేదు. సాముదాయికంగా మాత్రం యూదులు దేవుణ్ణి నాన్న అని పిల్చిన ఘట్టాలు పూర్వవేదంలో కొన్ని వున్నాయి. ఈ సంబోధనాన్నిబట్టి క్రీస్తు తండ్రికి ఎంతో సన్నిహితంగా మెలిగేవాడనీ, ఆ దేవునికి తాను ఎంతో చనువుతో ప్రార్ధన చేసికొనేవాడనీ విశదమౌతుంది. కనుక ప్రార్థనలోని మొదటి ముఖ్యాంశం భగవంతునిపట్ల వ్యక్తిగతమైన పరిచయమూ, అనుభవమూ, చనువూ పెంపొందించుకోవటం. మన ప్రార్ధనంలో ఈ లక్షణం తరచుగా లోపిస్తూంటూంది.

క్రీస్తు ప్రార్థనలోని రెండవ ముఖ్యాంశం ఇది. అతడు “తండ్రీ! ఈ పాత్రను నా యొద్దనుండి తొలగించు. ఐనా నీ యిష్ట ప్రకారమే జరుగనీయి" అని ప్రార్థించాడు - మార్కు 14, 36. దీన్నిబట్టి అతడు ఆ తండ్రి చిత్తానికి కట్టువడివుండేవాడని వ్యక్తమౌతుంది, ఆ తండ్రి పట్ల తాను కుమారుల్లా ప్రవర్తించేవాడని తెలుస్తుంది. క్రీస్తు ఇక్కడ పాత్రను, అనగా సిలువ మరణాన్ని తొలగించమని అడిగినా తండ్రి తొలగించలేదు. కనుక అతడు క్రూరమైన సిలువ మరణం మరణించ వలసివచ్చింది. అలాంటి ఘోరవిపత్తులో గూడ క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని జవదాటలేదు. నా యిష్టం గాదు, తండ్రి యిష్టమే నెరవేరాలి అనుకొన్నాడు.

ఇది చాల గొప్ప సత్యం. దేవుని చిత్తానికి కట్టవడి వుండడం అనే యీ లక్షణం మన ప్రార్థనల్లో చాలవరకు లోపిస్తుంది. మనం దేవుణ్ణి ఏదో అడుగుతాం. అతడు దాన్ని ఈయకపోతే ఇక సుమ్మర్లు ప్రారంభిస్తాం. అనగా మనం దేవుని చిత్తానికి కట్టువడం, దేవుడు మన చిత్తానికి కట్టవడాలని కోరుకుంటాం. మన మడిగింది పథ్యమైందైనా కాకపోయినా, దేవుడు ఇచ్చితీరాలని పట్టపడతాం, ఇది దేవునికి లొంగడంగాదు, దేవుణ్ణి లొంగదీసికోవడ మౌతుంది. ఈలాంటి మనస్తత్వంతో చేసే ప్రార్థన భగవంతునికి ప్రియపడుతుందా?