పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేకూర్చిపెట్టావు. నా వొంటరితనాన్ని నాలాగే బాధపడేవాళ్ళ శ్రేయస్సు కొరకు అర్పిస్తున్నాను. ఆదరంతో అంగీకరించు, నీ సిలువబలం నా బలహీనతలో నన్నాదుకొనునుగాక.

39. మానసికమైన వత్తిడికి గురైనపుడు

ఓ దేవా! నాకు నిద్రపట్టడంలేదు. విరామంలేని ఆలోచనలు నా మనసులో గూడుకట్టుకొంటున్నాయి. ఏదో వత్తిడీ, ఆయాసమూ, కలతా నన్నుపీడిస్తున్నాయి. ఏపని చేయాలన్నా కష్టంగా వుంది. మనసుకి విశ్రాంతిలేదు. ఇక మీదట మందులూ మాత్రలూ నిద్రబిళ్లలూ నా రోగాన్ని నయంచేయలేవు. ప్రభూ! నీవే నా మనస్సుకి విశ్రాంతి దయచేయి. నా హృదయానికి శాంతిని ప్రసాదించు. నేను నినాశ్రయించి నీ నుండి విశ్రాంతిని పొందగోరుచున్నాను. నా బరువునీ భారాన్నీ నీ భుజాలమీదనే మోపుతున్నాను. నన్ను కరుణించు.

40. ముసలివాళ్ళం అయ్యామనిపించినపుడు

ప్రభూ! నా జీవితం కలలాగ త్వరగా దాటిపోయింది. ప్రొద్దులాగ క్రుంకింది. ఇప్పడు ముసలితనంవచ్చిపెద్దపులిలాగ మీదికి దూకుతూంది. నేను నా పనులను నిన్ననో మొన్ననో ప్రారంభించానా అన్పిస్తూంది. ఇక నేను ఎంతో కాలం కష్టించి పనిచేయలేను. నేను ముసలివాడనై పోయానని అర్థంజేసికొంటూన్నాను. నా పనిలో సులువుగా అలసిపోతున్నాను. గట్టిగా ప్రయత్నం చేస్తేనేగాని పనిచేయలేకపోతున్నాను. నా జీవితాన్ని పరిశీలించి చూచుకొంటే ప్రతి సంఘటనంలోను నీ హస్తం కన్పిస్తూనే వుంది.

జరిగిపోయిన కాలంలో అడుగడుగునా నీవు నన్ను ఆదుకొంటూ వచ్చావు. ఇకమీదటగూడ నన్ను చేయి విడువవని నమ్ముతున్నాను. ప్రభూ! నేను పండు ముదుసలినై అవయవాల పటుత్వాన్ని కోల్పోయినపుడుగూడ నీవునన్ను విస్మరించకు.

41. ముసలితనం వల్ల అశక్తులమైనపుడు

ప్రభూ! నేను చాల ముసలివాడనయ్యాను. ఇక పనిచేయలేను, నన్ను నేను పరామర్శించుకోలేనుగూడ, నాకు పెద్దజబేమీలేదు. పండుముసలినయ్యాను అంతే. నా దేహంలో సత్తవలేదు. జ్ఞాపకశక్తి సన్నగిల్లింది. నిద్ర మందగించింది. కొన్నిసార్లు సరిగా ఆలోచించలేక పోతున్నాను. చాలా పర్యాయాలు వొంటరితనంవల్ల బాధపడుతూన్నాను. నా స్నేహితులూ నన్ను విలువతో చూచినవాళూ ఒకరితర్వాత వొకరు దాటిపోయారు. ఐనా నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను. నా రోజులు ప్రశాంతంగానే సాగిపోతున్నాయి. 52