పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాధలతో సతమతమయ్యేవారినీ, భావిలో తాము సాధింపగోరిన కార్యాలను వదలి వేయవలసి వచ్చిందే అని వేదనజెండేవారినీ, అపార్ధాలవలన మనోవేదనకు గురై ఏమీ చేయలేక దుఃఖించేవారినీ, అన్నిటికంటె అధికంగా మృత్యువు చేరువైనా గూడ పరలోక్త జీవితంమీద నమ్మకంలేనివారినీ, దేవుణ్ణి నిరాకరించి దూషించేవారినీ, క్రీస్తు తమకొరకు ముందుగానే శ్రమలనుభవించి తమ శ్రమలను పవిత్రపరచాడని గుర్తించలేనివారినీ అమ్మా! ఆదరంతో కరుణించు.

36. నొప్పిగా వున్నపుడు

యేసు ప్రభూ! నొప్పి యెంత బాధను కలిగిస్తుందో నీకు బాగా తెలుసు. నీ విరోధులు నీ వీపును కొరడాలతో బాదారు. నీ తలపై ముళ్లకిరీటం పెట్టి కొట్టారు. నీ కాలు సేతుల్లో చీలలు దిగగొట్టారు. కనుక నొప్పి ఎంత వ్యధను కలిగిస్తుందో నీకు అనుభవపూర్వకంగా తెలుసు, ఇప్పడు భరింపరాని నొప్పినా శరీరాన్ని తొలిచివేస్తూంది. ప్రభూ! నేనీ బాధను ధైర్యంతోను సహనంతోను భరించేలా చేయి. నీవు నా శక్తికి మించిన బాధను నాకు పంపవని నేను గ్రహించేలా చేయి. ఈ కారుచీకటిలోగూడ నీవు నాతో వుండి నాకు వెలుగును దయచేస్తూ వుంటావని నేను మరచిపోకుండేలా చేయి.

37. బాధలవల్ల లాభాలు

ఓ ప్రభూ! అనేక కారణాలవల్ల నీవు మాకు వ్యాధిబాధలు పంపుతూంటావు. ఆ బాధలు మాకు ఎన్నో వుపకారాలు చేసిపెడతాయి. అవి మేము నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనేలా చేస్తాయి. మేము ఈలోక సుఖభోగాలకు అంటిపెట్టుకొని వుండకుండేలా చేస్తాయి. మా పాపాలకూ తోడివారి పాపాలకూ మేము ప్రాయశ్చిత్తంచేసేలా చేస్తాయి. కనుక నీవు పంపే బాధలను నేను మంచిమనసుతో అంగీకరించేలా చేయి. నా మంచి చెడ్డలు నాకంటె నీకు యొక్కువగా తెలుసు. కావున నన్ను నేను నీ చేతుల్లోకి అర్పించుకొంటున్నాను. ఓర్పుతో నీ చిత్తానికి లొంగి వుంటే నాకెంతో మనశ్శాంతి కలుగుతుందని నేను గ్రహించేలా చేయి.

38. ఒంటరితనంవల్ల బాధపడేపుడు

ప్రభూ! నేను వంటరితనంవల్ల బాధపడుతూన్నాను. కాని నీవు సిలువమీద వ్రేలాడుతూ లోకంలోని వంటరితనాన్నంతటినీ నీ వొక్కడివే అనుభవించావు. సిలువమీద వంటరిగా చనిపోయి, నేడు వంటరితనంవల్ల బాధపడే నా బోటివాళ్ళ కందరికీ ధైర్యాన్ని 51